యూజర్ల డేటా దుర్వినియోగంపై మంగళవారం యూఎస్ కాంగ్రెస్ ముందు హాజరైన ఫేస్బుక్ వ్యవ్యస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉన్నతస్థాయి కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన 33 ఏళ్ల జుకర్.. తాను చేసింది పెద్ద తప్పుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. 'ఫేస్‌బుక్‌ను మొదలుపెట్టింది నేనే.. సంస్థలో ఏం జరిగినా దానికి పూర్తి స్థాయి భాద్యత నాదే. నాకు ఒక అవకాశం ఇస్తారని భావిస్తున్నా' అని పేర్కొన్నారు .
ఫేస్‌బుక్‌కు చెందిన 8.7 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడలేకపోయినందుకు తనను క్షమించాలని జుకర్‌బర్గ్ అమెరికా చట్టసభను కోరారు. కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణానికి పూర్తిగా తనదే భాద్యత అని ఒప్పుకున్నారు. డేటా దుర్వినియోగం కాకుండా ఫేస్బుక్ కానీ, సంస్థ సభ్యులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. తమ బాధ్యతకు సంబంధించి తగినంత విస్తృత దృక్పథాన్ని ఏర్పరచుకోలేకపోయామని, ఇది పొరపాటేనని లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. అమెరికా చట్టసభకు సంబంధించిన మరో రెండు కమిటీల ముందు జుకర్ హాజరు కానున్నారు.
2016 సంవత్సరంలో ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జి ఎనలిటికా అనే సంస్థ లీక్ చేసి, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు దోహదం చేయడంతో పాటు, భారత్ సహా వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు డేటాను అందించిందన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ డేటా లీకేజీ నిజమేనని, తప్పు జరిగిదంటూ జుకర్‌బర్గ్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఫేస్బుక్లో డేటా భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు కూడా చేపట్టారు. అయితే ఫేస్బుక్ వినియోగదారుల్లో 8.7 కోట్ల మంది డేటా ఇప్పటికే లీక్ అయిందన్న వార్తలు ఆందోళనను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరయ్యారు.