వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోపై హత్యాయత్నం జరిగింది. శనివారం నికోలస్.. కారకాస్ పరేడ్లో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై డ్రోన్ల ద్వారా బాంబు దాడి జరిగింది. అయితే డ్రోన్లు ఆయనకు సమీపంలో పేలడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించున్నారు. ఈ దాడిలో కొందరు సైనికులు గాయపడగా.. వారందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కాగా పోలీసులు కొందరిని అరెస్టు చేశారు.
అయితే పేలుడు పదార్థాలు అంత శక్తివంతమైనవి కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. ఘటనానంతరం అక్కడికి వచ్చిన సైనికులు, ప్రజలు పరుగులు తీయడం స్థానిక ఛానెళ్ల ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించింది.
అయితే, ఘటనకు కారణం లెఫ్ట్ పార్టీలేనని ఆ దేశ మంత్రి జార్జ్ రోడ్రిగోజ్ ఆరోపించగా, అధ్యక్షుడు మాదురో మాత్రం ఇది పొరుగు దేశమైన కొలంబియా పనేనని ఆరోపిస్తున్నారు. మరోవైపు మాదురో ఆరోపణలను కొలంబియా ఖండించింది. దేశాధ్యక్షుడై ఉండి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని పేర్కొన్నారు.
ఆరోసారి వెనెజులా దేశాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న మాదురోపై దేశంలో వ్యతిరేకత ఉంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఐదేళ్లుగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ఆ దేశ పౌరులు పొరుగుదేశాలకు వలస వెళ్తున్నారు. కొలంబియా, ఫ్లోరిడాలకు ఎక్కువ సంఖ్యలో వలస వెళ్లినవారు కూడా ఉన్నారు.