ఏపీలో 15 మంది ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 15 మంది ఐపీఎస్ అధికారులతో పాటు.. 15 మంది జూనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. 

Last Updated : Oct 24, 2018, 09:03 AM IST
ఏపీలో 15 మంది ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 15 మంది ఐపీఎస్ అధికారులతో పాటు.. 15 మంది జూనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. మంగళవారం దీనికి సంబంధించి ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. బదిలీ అవుతున్న అధికారులతో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మాట్లాడారు. ఈ బదిలీల సందర్భంగా కొందరు అధికారులకు అదనపు పోస్టింగులు కూడా ఇచ్చిన్నట్లు సమాచారం. ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా రాయలసీమ ప్రాంతాల్లో సేవలందించడానికి యువ అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు వినికిడి.

ఈ బదిలీల్లో భాగంగానే విపత్తు నిర్వహణ శాఖ కమీషనర్ శేఖర్ బాబును శాప్ ఎండీగా నియమించనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే కర్నూలు సంయుక్త కలెక్టరు ప్రసన్న వెంకటేశ్‌‌కు.. విపత్తు శాఖ కమీషనరుగా బాధ్యతలు అప్పగించనున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓ పి.రవిని కర్నూలు జేసీగా పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లా కలెక్టర్లను కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది. 

అలాగే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా సవరణ ప్రోగ్రామ్ ఈ నెలాఖారు వరకూ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ పూర్తయ్యాకే ఈ బదిలీలకు సంబంధించిన జాబితా వెలువడుతుంది అని కూడా అంటున్నారు.  వచ్చే ఎన్నికల సమయానికి ఈసీ నిబంధనల ప్రకారం అధికారులు ఒకే జిల్లాలో ఉండేందుకు ఆస్కారం లేదు కాబట్టే ఈ బదిలీల ప్రక్రియ మరల జరిగినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులకు సంబంధించిన బదిలీ అంశాలపై డీజీపీ  ఆర్పీ ఠాకూర్‌తో పాటు ఎనిమిది మంది ఎస్పీ స్థాయి అధికారులతో చంద్రబాబు ఉండవల్లిలో చర్చించారు.

Trending News