ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతి రైతులు 19 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నా .. ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. పైగా రాజధానుల ఏర్పాటుపై కమిటీలపై కమిటీలు వేస్తుండడంపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని కోరుతూ అన్ని వేదికలపైనా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
హైదరాబాద్లో అమరావతి రైతులు
అమరావతి రైతులు ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తమ మొర వినిపించారు. రాజధాని అమరావతిని తరలించకుండా కేంద్రం నుంచి సాయం చేయాలని కోరారు. ఆయన వద్దకు వచ్చిన రైతులు భావోద్వేగంతో కాళ్ల మీద పడ్డారు. రాజధాని కోసం భూములను త్యాగం చేస్తే .. మమ్మల్ని నట్టేట ముంచేశారని కన్నీరు పెట్టుకున్నారు.
జగన్ ప్రకటన వల్లే అయోమయం: కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటన వల్లే అమరావతిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉద్రిక్త వాతావరణం లేకుండా సమస్య పరిష్కరించాలని కోరారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం చర్చించుకుని సమస్య పరిష్కరించాలన్నారు. సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.