భావికాలంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తే.. దానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తుందని.. ఏపీ రాజధాని అమరావతిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం తథ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 2018 కామన్‌వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న రాగాల వెంకట్ రాహుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
రాహుల్ తన తల్లి ఆశీస్సులతోనే.. ఆమె అందించిన ఆత్మవిశ్వాసంతోనే ఎంతో గొప్ప స్థానానికి ఎదిగాడని తెలిపారు. స్టూవర్టుపురం లాంటి ఊరిలో పుట్టి పెరిగిన వెంకట్ రాహుల్.. ఆ ఊరి పేరుకి ఉన్న మచ్చని పోగొట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. క్రీడల్లో విజయాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచేవారికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న వెంకట రాహుల్‌కి రూ.50 లక్షల నగదు, ఇంటి స్థలం, గ్రూప్ 2 ఉద్యోగాన్ని ప్రకటించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.