అన్నీ సవ్యంగా జరిగితే.. మరో అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీ ప్రకటన వెలువడే అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఈ నెల 25 లేదా 26వ తేదిన డీఎస్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఈ మేరకు విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ దస్త్రాన్ని సోమవారం లేదా మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు పంపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు, మూడు రోజులకంటే ఎక్కువ సమయం పట్టదని పలువురు భావిస్తున్నారు. కాగా.. టెట్ మాదిరిగానే డీఎస్సీని కూడా ఆన్ లైన్ విధానంలోనే నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇంకో వైపు.. విద్యాశాఖ డీఎస్సీ సిలబస్ విషయమై కూడా ప్రకటన ఇచ్చేసింది. ఈసారి డీఎస్సీలో ఎస్టీజీలకు టెట్, టీఆర్టీ పరీక్షలు కలిపి నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీ, పీజీటీలకు మాత్రం పరీక్షలు వేరుగా నిర్వహించనున్నారు. అయితే ఎస్టీజీలకు సంబంధించిన సిలబస్ కేవలం 8వ తరగతి వరకు మాత్రమే ఉండగా.. స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలకు మాత్రం సిలబస్ ప్రకారం ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది.
అయితే ఎస్జీటీలకు సంబంధించి టెట్, టీఆర్టీ కలిపి నిర్వహించే పరీక్షల్లో కూడా 20 శాతం లెక్కించి.. టెట్ వెయిటేజీగా ఇస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మళ్లీ విద్యాశాఖ పునారాలోచించి నిర్ణయం తీసుకుంటుంది. కాగా.. ఇప్పటికే ఎస్జీటీలకు టెట్, టీఆర్టీ కలిపి నిర్వహించాలని సర్కారు ఉత్తర్వులను శుక్రవారం అందించింది. అదేవిధంగా.. వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థికశాఖ నుండి అదనపు అనుమతులు రావాల్సి ఉండడంతో.. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న అంశం దాని మీద కూడా ఆధారపడి ఉంది.