ఏలూరు: 'మీ సేవ' కేంద్రాలను రద్దు చేయాలనే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్టు వస్తోన్న వార్తలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని స్పందించారు. ప్రస్తుతానికి మీ సేవలను రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని, ఇప్పటివరకు కేబినేట్లో ఈ విషయం చర్చకు కూడా రాలేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. జిల్లాలోని మీసేవ నిర్వాహకుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తనను కలిసిన సంఘం నేతలుతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అంతకన్నా ముందుగా ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందించిన సంఘం నాయకులు వి.పార్థసారథి, టి.పాపారావు గుప్తా మాట్లాడుతూ పత్రికల్లో వస్తున్న ప్రకటనలు, వార్తా కథనాలు మీసేవ ఆపరేటర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. మీ సేవ కేంద్రాలపై 30 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వారు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
చాలీచాలని కమీషన్లతో మీసేవ కేంద్రాలను నిర్వహిస్తున్నామని.. ఒకవేళ ప్రభుత్వమే మీసేవ కేంద్రాలను నిర్వహించాలనుకున్నట్టయితే, ఇప్పటికే మీ సేవ కేంద్రాలను నిర్వహిస్తున్న వారికి ప్రాధాన్యం ఇచ్చి తీసుకోవాలని సంఘం నాయకులు ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు.