అమరావతి: ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎన్జీవో(AP NGOs)లు రోడ్డెక్కారు. బందరు రోడ్ పంచాయతీ రాజ్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన(AP NGOs protests) వ్యక్తం చేసిన ఎన్జీవోలు.. న్యాయమైన సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, ప్రభుత్వాలు కమిటీలతో కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. 2018 జులై ఒకటి నుంచి 55 శాతం చొప్పున పిఆర్‌సి(PRC) ఇవ్వాలని.. మూడు విడతల డిఎ వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీస్ రద్దు చేస్తానని ప్రకటించిన సర్కార్.. కమిటీలతో కాలయాపన చేస్తోందని అన్నారు. కాంట్రాక్ వర్కర్స్‌ని రెగులరైజ్ చేయాలని.. అలాగే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత 3 నెలలుగా జీతాలు సకాలంలో చెల్లించడం లేదని.. ఇకపై ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని అన్నారు.
ప్రమోషన్ టెస్ట్‌లలో నెగటివ్ మార్కుల విధానాన్ని తొలగించాలని కోరిన చంద్రశేఖర్ రెడ్డి.. మహిళా ఉద్యోగులకు 5 అదనపు సెలవులు ఇవ్వాలని అడిగారు. టీచర్స్‌కి ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడం వల్లే ఇవాళ ఇలా ఉద్యోగులు, టీచర్స్, పెన్షనర్స్ నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.