ఈ నెల 29న ప‌దో త‌ర‌గ‌తి పరీక్షా ఫలితాలు

ఏప్రిల్ 29వ తేదీన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి

Last Updated : Apr 24, 2018, 08:19 AM IST
ఈ నెల 29న ప‌దో త‌ర‌గ‌తి పరీక్షా ఫలితాలు

ఏప్రిల్ 29వ తేదీన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖపట్టణం వేదికగా ఈ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామన్నారు. మార్చి 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను సుమారు 6లక్షల మందికిపైగా విద్యార్థులు రాశారు.

విజయవాడలో సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖకు సంబంధించిన అనేక అంశాలపై అధికారులతో మంత్రి గంటా తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. మరింత మంది డీఎస్సీకి అర్హత సాధించే దిశగా మరో టెట్‌ పరీక్షకు సంబంధించి మే 4వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసి, జూన్‌ 10 నుంచి టెట్‌ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సమావేశంలో చర్చించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పలు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు సంబంధించి జీవోలు జారీ చేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకుపోవాలని అధికారులను కోరారు. మన వూరు -మన బడి కార్యక్రమాన్ని వేసవి తీవ్రత దృష్ట్యా జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఆయన పాఠశాలల అభివృద్ధికి రోటరీ క్లబ్‌తో ఎంవోయూకు విద్యాశాఖ సూత్రప్రాయ అంగీకారం కుదిరిందన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వకుండా క్లాసులు నిర్వహిస్తే చర్యలు తప్పవని, ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి గంటా హెచ్చరించారు.

Trending News