అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో మళ్లీ దర్యాప్తు మొదలైంది. ఇందులో భాగంగా ఆమె మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి తెనాలి పోలీసులకు, గుంటూరు జిల్లా కలెక్టర్‌కు, వైద్యులకు సీబీఐ అధికారులు సమాచారం అందించారు. రీ పోస్ట్ మార్టం కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి సీబీఐ అధికారులు చెంచుపేట శ్మశానవాటికకు చేరుకున్నారు. సమాధి గుర్తింపు పని కూడా పూర్తి చేశారు.
ఆయేషా హత్య కేసులో కీలకాంశాలు...
బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా 12 ఏళ్ల క్రితం.. అంటే 2007 డిసెంబర్ 12న దారుణ పరిస్థితుల్లో శవమై కనిపించింది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 2008 ఆగస్టు 11న సత్యం బాబును అరెస్ట్ చేశారు. 2010లో సత్యం బాబుకు విజయవాడ సెషన్స్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐతే 8 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత.. హైకోర్టు అతన్ని నిర్దోషిగా నిర్ధారించింది. దీంతో 2017 మార్చి 31న సత్యం బాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అసలు నిందితులను పట్టుకునేందుకు హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. 2018 నవంబర్ 29న సీబీఐ విచారణ కోసం ఆదేశించింది. దీంతో 2019 జనవరిలో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసుకు సంబంధించిన పలు కీలక ఆధారాలను సేకరించింది.
రీ పోస్ట్ మార్టం ఎలా ?
విచారణలో భాగంగా ఆరు నెలల క్రితమే ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించేందుకు సీబీఐ అధికారులు సన్నాహాలు చేశారు. ఐతే మత పెద్దలు అంగీకరించడం లేదంటూ అయేషా తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో రీ పోస్ట్ మార్టం ప్రక్రియకు ఆలస్యమైంది. ఎట్టకేలకు కోర్టు అనుమతి ఇవ్వడంతో రీ పోస్ట్ మార్టంకు అయేషా తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో చెంచుపేట శ్మశానవాటికలో సీబీఐ అధికారులు తదుపరి ప్రక్రియకు అంతా సిద్ధం చేశారు. రీ పోస్ట్ మార్టం చేయడం ద్వారా కీలకమైన ఆధారాలు లభిస్తాయని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.