దేశీయ ఎఫ్ఎంసీజీ సంస్థ బ్రిటానియా ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్‌ను ఏపీకి తరలించే ఆలోచనలో ఈ సంస్థ ఉంది. ఈ ప్లాంట్‌కు తగినంతగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సమయం తీసుకొంటోందని.. దీనిపై ఇప్పటికే తాము ఏపీ ప్రభుత్వంతోనూ సంప్రదించామని సంస్థ ఛైర్మన్ నుస్లీ వాడియా తెలిపారు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
'మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఏడాదికిపైగా వేచి వేచి ఉన్నాం. ప్రభుత్వం ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే దీనిపై మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాము' అని కోలకతాలో జరిగిన 99వ వార్షిక సమావేశంలో సంస్థ చైర్మన్ నుస్లీ వాడియా సోమవారం వెల్లడించారు. సుమారు రూ.300కోట్ల రూపాయలతో డైరీ ప్లాంట్ ను బ్రిటానియా నెలకొల్పనుంది.
వందేళ్ల బ్రిటానియా.. కొత్త లోగో విడుదల
బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన శతాబ్ది వేడుకలను ప్రారంభించింది. ఈ సందర్భంగా కొత్త లోగోను కంపెనీ ఛైర్మన్ నుస్లీ వాడియా విడుదల చేశారు. పాత లోగోతో పోలిస్తే కొత్తది భిన్నంగా ఉందనీ, తమ అంచనాలకు అనుగుణంగానే లోగో కూడా మోడరన్ లుక్‌లో ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు షేర్ హోల్డర్లకు బోనస్ డిబెంచర్ల(షేరు రూ.60)ను ప్రకటించింది కంపెనీ. వచ్చే 6 నెలల్లో ఎన్నో కొత్త ఉత్పత్తులు రానున్నాయని.. గత ఐదేళ్లలో రూ.800కోట్లు ఆదా చేసినట్లు తెలిపింది. బిస్కెట్ల మార్కెట్లో బ్రిటానియానే అగ్రస్థానంలో ఉందని, మరో ఐదేళ్లకు వరుణ్ బెర్రీనే ఎండీగా కొనసాగించనున్నట్లు తెలిపింది. కంపెనీ త్వరలోనే బిస్కెట్లు, రొట్టెలు, కేకులు, పాల ఉత్పత్తులకు పరిమితం కాకుండా, పూర్తి ఫుడ్ కంపెనీగా మారుతుందన్నారు.