విశాఖపట్టణం: కోస్తాంధ్రను చిగురుటాకులా వణికించిన పెథాయ్ తుఫాన్ నిన్న సోమవారం మధ్యాహ్నం తొలుత 12.15 గంటలకు తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన సమీపంలో తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇక తుపాన్ తీరం దాటినట్టే అనుకుంటున్న తరుణంలో తుపాన్ మరోసారి సముద్రంలోకి వెనక్కి వెళ్లి తిరిగి తుని సమీపంలో మరోసారి తీరం దాటింది. పెథాయ్ తుఫాన్ కోస్తాంధ్రలో భారీ విధ్వంసమే సృష్టించినప్పటికీ.. అదృష్టవశాత్తుగా తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల వేగం ఊహించిన స్థాయిలో లేకపోవడం, తీరాన్ని తాకకముందే తుఫాన్ బలహీనపడటంతో నష్టతీవ్రత ఇంకొంత తగ్గింది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100కుపైగా వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని తొలుత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, ఆ సమయంలో గాలుల వేగం కొన్ని ప్రాంతాల్లో గంటకు 70-90 మించకపోవంతో నష్టం తీవ్రత తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తుపాన్ ఒడిషా వైపు కదులుతున్నప్పటికీ.. మరో 24 గంటలపాటు అప్రమత్తంగా వుండి, అన్నిరకాల ప్రజాసేవలు పునరుద్దరించాలని ప్రభుత్వం సంబంధిత అధికారయంత్రాగాన్ని ఆదేశించింది.
పెథాయ్ తుఫాన్ కోస్తాంధ్రలో రైతులకు మరోసారి కన్నీరునే మిగిల్చింది. తుఫాన్ ప్రభావంతో వీచిన చలిగాలులకు 17 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. కోతకు సిద్ధంగా వున్న వరి నేలకొరగగా, నాట్లు, పత్తి, కూరగాయల తోటలు, ఉద్యానవన పంటలు తుఫాన్ ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంకొన్ని చోట్ల కోసిన వరి పంట, ధాన్యం వర్షంనీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ కారణంగా దాదాపు 14వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అనేర ప్రాంతాల్లో వృక్షాలు, స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.