ఏపీలో నేటి నుంచి ఎంసెట్ పరీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్-2018 ఏప్రిల్ 22 నుంచి ప్రారంభంకానుంది.

Last Updated : Apr 22, 2018, 07:55 AM IST
ఏపీలో నేటి నుంచి ఎంసెట్ పరీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్-2018 ఏప్రిల్ 22 నుంచి ప్రారంభంకానుంది. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారంగా అభ్యర్ధులు ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కాకినాడ జేఎన్‌టియూ పర్యవేక్షణలో హైదరాబాద్‌లో 3 రీజనల్ సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 44మొత్తం 47 రీజనల్ సెంటర్ల పరిధిలోని మొత్తం 140 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 25వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. నేటి నుంచి 24వ తేదీ వరకూ ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి, 25వ తేదీన అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల ప్రవేశానికి పరీక్ష జరుగుతుంది.

రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం 8 గంటలకు కాకినాడ జేఎన్‌టియూలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సెట్ కోడ్ విడుదల చేసిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 10 గంటల నుండి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రారంభమవుతుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. పరీక్షా సమయానికి గంట ముందు అభ్యర్ధులు చేరుకోవాలని, నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు అన్నారు. ఈ ఏడాది ఎంసెట్‌కు సుమారు 2 లక్షల 75వేల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను బయోమెట్రిక్ తనిఖీ అనంతరం అనుమతిస్తారు.

చేయాల్సినవి:

* హాల్‌టికెట్‌ను టెస్ట్ సెంటర్ గేటు వద్ద, పరీక్షా హాలులో చూపించాలి. లేకపోతే పరీక్ష రాయనివ్వరు.  

* అభ్యర్థి పరీక్షా హాల్‌లోకి బ్లాక్ / బ్లూ బాల్ పాయింట్ పెన్నును, హాల్ టికెట్టును మాత్రమే తీసుకొని రావాలి.

* బయోమెట్రిక్ తనిఖీ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు కనీసం ఒక గంట ముందుగా పరిక్షా కేంద్రానికి చేరుకోవాలి.

* అభ్యర్థికి కంప్యూటర్ సమస్య ఉంటే ఇన్విజిలేటర్ కు చెప్తే, ఆయన వేరే సిస్టం ఇస్తారు.

* హాల్‌టిక్కెట్ వెనుక భాగంలో గూగుల్ మ్యాప్ ఇచ్చారు. మ్యాప్‌లో నిర్దేశిత పరీక్షా కేంద్రానికి బస్టాండ్ ఎంత దూరంలో ఉన్నదో వివరించారు. ఆ ప్రకారం విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలి.

చేయకూడనివి:

* కాలుక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ వాచీలు, సెల్ ఫోన్లు సహా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలో అనుమతించరు.

* పరీక్ష సమయంలో అభ్యర్ధులు పరీక్షా హాలులో ఏ ఇతర అభ్యర్థితో మాట్లాడరాదు.

Trending News