తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్టీసీ సర్వీసులపై నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఐతే ఆర్టీసీ బస్సులను పునఃప్రారంభించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దాదాపు 58 రోజులుగా ఆర్టీసీ బస్సు చక్రం ఆగిపోయింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఐతే తెలంగాణలో ఆర్టీసీ బస్సులను నిన్నటి(మంగళవారం) నుంచి ప్రారంభించారు. దీంతో రేపటి నుంచి (గురువారం) ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. ఐతే ఆర్టీసీ బస్సులను పునఃప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ చెప్పారు. చైనాలోని బీజింగ్, షాంఘై తరహా పద్ధతిని పాటిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం సర్వీసులు అంటే 1683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నామని చెప్పారు.
బస్సులలో కండక్టర్లు ఉండరని తెలిపారు. వారు సూపర్ స్రెడర్స్ గా మారే అవకాశం ఉన్నందున వారిని వినియోగించడం లేదని చెప్పారు. ఐతే ఆన్ లైన్, డిజిటల్ మోడ్ లోనే టికెట్లు విక్రయిస్తున్నట్ల వివరించారు. బస్టాండ్లలో శానిటైజర్స్ ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండా ఒక్కో బస్సుపై 10 వేల రూపాయలు ఖర్చు చేసి సీటింగ్ అంతా సవరించినట్లు తెలిపారు. సీటింగ్ మధ్య సోషల్ డిస్టన్స్ ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పల్లె వెలుగు బస్సుల్లో మాత్రం ఏయే కుర్చీల్లో కూర్చోవద్దో వాటిని రెడ్ మార్క్ వేసినట్లు వివరించారు.
బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే నిబంధన విధించామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. అంతే కాకుండా బస్టాండ్ లోని అన్ని షాపుల్లో విధిగా మాస్కులు విక్రయించాలనే నిబంధన విధించామన్నారు. అది కూడా 10 రూపాయల కంటే మాస్క్ ఎక్కువ ధరకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 65 ఏళ్లు దాటిన వారిని, 10 ఏళ్ల లోపు పిల్లలను బస్సులలో ప్రయాణానికి అనుమతించడం లేదు. ఒకవేళ ఆరోగ్య అత్యవసరమైతే అనుమతిస్తామని ఆర్టీసీ ఎండీ తెలిపారు.
సిటీ బస్సు సర్వీసులు తరువాత ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం అంతర్రాష్ట్ర సర్వీసులుపై నిషేధం ఉంది కాబట్టి..ఇప్పుడు ఆ సర్వీసులు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..