ఆర్టీసి సమ్మెపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ఆర్టీసి సమ్మెపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందన

Last Updated : Oct 7, 2019, 10:40 PM IST
ఆర్టీసి సమ్మెపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌: టిఎస్ఆర్టీసి సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని, ఉద్యోగులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదార భావంతో వ్యవహరించాలని ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కోరారు. 'తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై స్పందిస్తూ పవన్‌ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ప్రభుత్వం.. 48,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నామని ప్రకటించడం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసి సిబ్బంది కూడా పదిహేడు రోజులపాటు సమ్మె చేసి ఉద్యమానికి అండగా నిలబడ్డారని ప్రస్తావిస్తూ.. అప్పుడు వారు చేసిన త్యాగాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకోవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని ఉభయులకూ విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసి ఆర్టీసి సమ్మెపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Trending News