టీడీపీ చేస్తున్న దీక్ష నవ నిర్మాణ దీక్ష కాదని, అది నయ వంచన దీక్ష అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. చంద్రబాబువి అన్నం పెట్టే చేతిని నరికే చావు తెలివితేటలన్నారు. కేంద్ర నిధులను దారి మళ్లించి టీడీపీ అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. అక్రమంగా పోలవరం ప్రాజెక్టుకు ఏఈ స్థాయి అధికారిని తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని రాహుల్ మెప్పుకోసం బీజేపీని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
నాలుగేళ్ల పాలనలో మోదీ అవినీతి రహిత పాలన సాగించి అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు.156 సంక్షేమ పథకాలను మోదీ అమలు చేసి.. అన్ని వర్గాల వారికి చేయూతను ఇచ్చారని పేర్కొన్నారు. విభజన బిల్లులో చాలా అంశాలను కేంద్రం అమలు చేసిందని.. చంద్రబాబుకు వాస్తవాలు చెప్పాలని అన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలను ప్రజలకు వివరించి 2019 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తానని కన్నా అన్నారు. రెండు నెలల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపడుతామన్నారు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి, అవినీతి రహిత పాలన సాధ్యమన్నారు. బిజెపిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి.. మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని కన్నా ఈ సందర్భంగా తెలిపారు.
అంతకు ముందు విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణను పలువురు పార్టీ నేతలు సన్మానించి అభినందనలు తెలిపారు.