రాజధానిపై ఏపీ అసెంబ్లీలో మంత్రి బొత్స కీలక ప్రకటన

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేక మరెక్కడికైనా తరలిపోతుందా అని గత కొంత కాలంగా వినిపిస్తున్న రకరకాల సందేహాలు, ఊహాగానాలకు ఒకరకంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఫుల్‌స్టాప్ పెట్టారు.

Updated: Dec 10, 2019, 01:10 PM IST
రాజధానిపై ఏపీ అసెంబ్లీలో మంత్రి బొత్స కీలక ప్రకటన

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేక మరెక్కడికైనా తరలిపోతుందా అని గత కొంత కాలంగా వినిపిస్తున్న రకరకాల సందేహాలు, ఊహాగానాలకు ఒకరకంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఫుల్‌స్టాప్ పెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చాకా రాజధానిపై రకరకాల సందేహాలు నెలకొన్నాయని మంగళవారం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించగా.. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని టీడీపీ సభ్యులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ సభ్యుల డిమాండ్‌పై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వం కూడా రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనతోనే ఉందని అన్నారు.

టీడీపీ నేతల ప్రశ్నలకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం ఇస్తూ.. రాజధాని విషయంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అమరావతిలో గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే అన్నానని ఈ సందర్భంగా ఆయన తన పాత వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు. త్వరలోనే రాజధాని ప్రాంతంలోని రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అందిస్తామని మంత్రి బొత్స సభలో ప్రకటించారు. అలాగే, ఇటీవల కేంద్రం విడుదల చేసిన కొత్త చిత్రపటంలో అమరావతిని రాజధానిగా గుర్తించకపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి బొత్స ఆరోపించారు.