Nara Lokesh booked in Criminal case: అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అనంతపురం జిల్లా రాయదుర్గ్ నియోజకవర్గం పరిధిలోని డి హిరేహాల్ పోలీసు స్టేషన్లో ఓ క్రిమినల్ కేసు నమోదైంది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా రాంపురంలో ఏప్రిల్ 21న జరిగిన ఓ దాడి ఘటనతో ఎలాంటి సంబంధం లేని ఏపీ ప్రభుత్వ విప్, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి ముడిపెడుతూ ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీయడంతో పాటు ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీని నష్టపరిచేందుకు కుట్ర చేశారంటూ నారా లోకేష్‌పై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
కాపు రామచంద్రా రెడ్డి (Kapu Ramachandra Reddy) గౌరవానికి భంగం కలిగేలా, ఆయనకు రాజకీయంగా, సామాజికంగా చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తూ నారా లోకేష్ సోషల్ మీడియాలో పలు అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారంటూ వైసీపీ ఎస్టీ సెల్ నాయకుడు భోజరాజు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోజరాజు నాయక్ ఫిర్యాదును స్వీకరించిన డి.హిరేహాళ్ పోలీసులు నారా లోకేష్‌పై ఐ.పి.సి 153(A), 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
టీడీపీ సోషల్ మీడియా విభాగంలో చురుకుగా వ్యవహరిస్తోన్న మారుతి అనే టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో కాపు రాంచంద్రా రెడ్డి తన అనుచరులతో దాడి చేయించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా ఆరోపణలు చేయగా.. ఆ ఆరోపణలను తిప్పికొడుతూ భోజరాజు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నారా లోకేష్‌పై (Nara Lokesh) ఈ క్రిమినల్ కేసు నమోదైంది.