మార్చి 31.. ఈ రోజుతో ఆర్థిక సంవత్సరం పూర్తవుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోనే రాష్ట్ర ఖజానా మాత్రం సంక్షోభం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా నిధుల కొరత సమస్య అధికారులను బాగా వేధిస్తుంది. ఉన్న సొమ్ముతో చెల్లింపులు జరిపే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు కూడా అనుకున్న తేదికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చని పలువురు అధికారులు అంటున్నారు.
వీటితో పాటు ఫించన్లు ఇత్యాదివన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటికే ప్రతి నెల రాష్ట్రం దాదాపు 4 వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. ఈ క్రమంలో శనివారం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమావేశమై ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాల్సి ఉంటుందో అన్న అంశంపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రత్యేక సమీక్ష చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 2 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేందుకు జిల్లాల కోశాధికారుల వద్ద నుండి కూడా రికార్డులు తెప్పించుకోనున్నారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లే పన్నులలో.. రాష్ట్ర వాటాను లెక్కించి.. వాటి ఆధారంగానే జీతాల చెల్లింపులు చేయాలి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఇలాంటి నిధులు దాదాపు 25 వేల కోట్లకు పైగానే ఏపీకి రావాలి. అయితే ఈ మధ్యకాలంలో ఈ నిధులను ఒకేసారి ఇవ్వకుండా దఫదఫాలుగా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల డబ్బు సర్దుబాటు చేసుకొని.. పరిస్థితికి అనుగుణంగా చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఇవ్వన్నీ ఒక ఎత్తు అయితే... ఆర్థిక లోటు అనేది ఇంకా పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.
దాదాపు 10 నుండి 12 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుండి ఆర్థిక లోటు క్రింద రావాల్సి ఉండగా.. కేంద్రం ఈ విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అవి కూడా రాష్ట్రానికి దక్కలేదు. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల సంగతి సరేసరి. ఇంత ఆర్థిక సంక్షోభంలోనూ గత సంవత్సరంతో పోల్చుకుంటే.. ఆ సంవత్సరం పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది అంటున్నారు అధికారులు