శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆధునికత పెరుగుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో వింత ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆచారాలతో పెద్దగా సమస్య లేనప్పటికీ .. వింతగా అనిపిస్తుంటాయి. అలాంటిదే శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది.
రోకలి నిలబడితే..
చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం .. ఇలాంటి సమయాల్లో తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయాలకు, ఆచారాలకు కాస్త పెద్ద పీట వేస్తారు. పూజలు చేయడం.. గుళ్లకు వెళ్లడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాంటి ఆచారమే వెలుగులోకి వచ్చింది. అక్కడ సూర్యగ్రహణం రోజు దాదాపు ప్రతి ఇంట్లో రోకలిని నిటారుగా నిలబెడతారు. సూర్య గ్రహణం రోజున ఇలా నిటారుగా రోకలి నిలబెడితే .. ఇంటికి ఉన్న అరిష్టాలు పోతాయని వారిలో ఓ నమ్మకం. అందుకే సూర్య గ్రహణ సమాయాల్లో తప్పనిసరిగా ఈ ఆచారాన్ని వారు పాటిస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటల15 నిమిషాల తర్వాత జిల్లాలోని వంగర, రేగిడి, అంబాడ మండలాల్లోని గ్రామాల్లో ఏ ఇంట చూసినా రోకలి నిలబెట్టే ఆచారం కనిపించింది.
గ్రహణ మహత్యమే..
నేలపై తాంబాలం ఉంచి అందులో రోకలిని నిలబెట్టారు. అది ఏ అధారం లేకుండా నిలబడింది. గ్రహణ మహత్యం ద్వారానే ఇలా నిలబడుతుందని స్థానికులు చెబుతున్నారు. సూర్య గ్రహణం పూర్తయిన తర్వాత ఇష్టదైవానికి గ్రామస్తులు పూజలు చేశారు.