ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఈకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియపై చర్చలు సాగుతున్నాయి.
విదేశీ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కైనెటిక్ గ్రూప్ ( Kinetic group ) భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఇప్పుడు మరో విదేశీ కంపెనీ ఆసక్తి చూపిస్తోంది. రాష్ట్రంలో పర్యావరణ రహిత ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీ ( Taiwan company ) ఆసక్తి చూపిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ( Ap minister Gautam reddy ) ప్రకటించారు.
తైవాన్ డైరెక్టర్ జనరల్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రాష్ట్రంలో రానున్న విదేశీ కంపెనీల పెట్టుబడుల గురించి వివరించారు. తైవాన్ కు చెందిన పీఎస్ఎ వాల్సిస్ కంపెనీ రాష్ట్రంలో 7 వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి యోచిస్తోందని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాతే...తుది ప్రకటన వెలువడుతుందన్నారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు తైవాన్ ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు.
మరోవైపు 15 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్వి ( Adani data Centre ) విశాఖలో ఏర్పాటు కానుందని తెలిపారు. రానున్న ఎస్ఐపీబీ సమావేశంలో దాదాపు 20 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. సెమీ కండక్టర్ తయారీ కోసం తైవాన్ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని..మౌళిక సదుపాయాల్ని కల్పించిన తరువాతే పరిశ్రమలు ఏర్పడతాయన్నారు. ఉద్యోగాలు ఎక్కువగా లభించే పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న అదాని డేటా సెంటర్, అపాచి కంపెనీల ద్వారా 40 వేల ఉద్యోగాలు లభించబోతున్నాయి.
బై సైకిల్ ఎగుమతులపై తైవాన్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. అదానీ సంస్థను తరలించేస్తున్నారంటూ టీడీపీ ( TDP ) నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని..ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. Also read: AP Schools reopen effect: విద్యార్ధులు, టీచర్లకు సోకిన కరోనా