Konaseema Update: జిల్లా పేరు వివాదంతో అట్టుడికిన కోనసీమలో ఇంకా నివురు గప్పినా నిప్పులానే ఉంది. సాధారణ పరిస్థితులే కనిపిస్తున్నా కోనసీమలో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇంకా ఇంటర్ నెట్ సేవలను పునరుద్దరించలేదు. మే24న జరిగిన అల్లర్ల తర్వాత కోనసీమలో ఇంటర్ నెట్ సేవలను తొలగించారు. అప్పటి నుంచి పునరుద్దరించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. ఇంటర్ నెట్ లేక డ్యూటీ చేయలేకపోతున్నారు. పక్క జిల్లాకు వెళ్లి కొందరు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ నెట్ సేవల బ్యాన్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని చంద్రబాబు ట్వీట్ చేశారు. కోనసీమను కశ్మీర్ లా మార్చేశారని ఆయన మండిపడ్డారు. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే ఇంటర్నెట్ సేవలు నిలిపివేత అనే వార్తను కోన సీమలో వినాల్సి రావడం బాధాకరమన్నారు చంద్రబాబు. కొత్త ఐటీ జాబ్స్ ఇవ్వలేని వైసీపీ సర్కార్.. కనీసం ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు పని చేసుకునే అవకాశం లేకుండా చేయడం దారుణమన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఇంటర్ నెట్ సామాన్యుడి జీవితంలో కూడా భాగమైందన్న చంద్రబాబు.. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
చిరు వ్యాపారుల దందాలు కూడా ఇంటర్ నెట్ ద్వారానే సాగుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుల తరబడి ఇంటర్ నెట్ సేవలు కట్ చేయడం సరికాదన్నారు. కోనసీమలో వెంటనే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇది లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన విషయమన్నారు చంద్రబాబు. జగన్ సర్కార్ చేతగానితనం వల్ల కోనసీమ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
మే 24న కోనసీమ సాధన సమితి నిర్వహించిన ర్యాలీ అదుపుతప్పింది. అమలాపురం తగలబడింది. వేలాది మంది నిరసనకారులు దాదాపు 6 గంటలపాటు అమలాపురంలో విధ్వంసానికి దిగారు. బస్సులను దగ్ధం చేశారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగలబెట్టారు. పోలీసులపైనా రాళ్ల దాడి చేశారు. అమలాపురం జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డితో పాటు 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. జిల్లాల విభజన చేసిన జగన్ ప్రభుత్వం.. ఏప్రిల్ 4న అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే ఈ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మారుస్తూ మే 18 కొత్త ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళనలకు దిగింది. మే24న చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. అమలాపురం మంట్లలో చిక్కుకుంది. ఈ ఘటనతో కోనసీమలో భారీగా బలగాలను మోహరించారు. అల్లర్లు జరకుండా ఇంటర్ నెట్ సేవలు తొలగించారు. అప్పటి నుంచి ఇంటర్ నెట్ సేవలను పునరుద్దరించలేదు. మూడు రోజుల క్రితం మరో వారం రోజులు పొడిగిస్తూ జిల్లా ఎస్పీ ప్రకటన చేశారు.
READ ALSO: Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు... మరో కశ్మీర్ పండిట్ హత్య...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook