కడప ఉక్కు కర్మాగారం: కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు

కడప ఉక్కు కర్మాగారం: కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు

Last Updated : Oct 13, 2018, 01:08 PM IST
కడప ఉక్కు కర్మాగారం: కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు శనివారం న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ సుజనా చౌదరి నేతృత్వంలోని ఏపీ టీడీపీ ఎంపీల బృందం బీరేంద్రసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా ఐదు డిమాండ్లను ఏపీ టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి ముందుకు తీసుకువచ్చినట్లు సమాచారం. అంతకుముందు ఎంపీ సుజనాచౌదరి నివాసంలో భేటీ అయిన ఎంపీలు పలు అంశాలపై చర్చించారు.

ఈ బృందంలో రాజ్య సభ సభ్యుడు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తాము పోరాటం కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఉక్కు శాఖ మంత్రితో భేటీ అనంతరం వైఎస్ సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు రాజకీయాంశాలే కారణమన్న ఆయన.. కడప స్టీల్‌ ప్లాంట్‌ అంశం ఉక్కు శాఖ మంత్రి చేతిలో లేనట్లుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి వారం రోజుల్లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక ప్రతిపాదనలు ఇచ్చామని గుర్తుచేశారు.

ఈ ఏడాది ఆగస్టు తొలివారంలో ఎంపీలు మంత్రి బీరేంద్రసింగ్‌‌ను కలిసి ఉక్కు కర్మాగారంపై చర్చించగా.. కర్మాగారంపై నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని బీరేంద్రసింగ్‌ ఎంపీలకు చెప్పారు. కొంత సమయమిస్తే నిర్ణయం తీసుకుంటామని ఆగస్టులో చెప్పినా..  కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మరోసారి కలవాలని నిర్ణయించుకున్న టీడీపీ ఎంపీలు నేడు కలిశారు. మరోవైపు విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై ఆయా మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ ఎంపీలు డిసైడ్ అయ్యారు.

 

Trending News