ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ మంగళవారం ఒకే అంశంపై నిరసన తెలిపాయి. అదే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం. అవును, ఇటీవల కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తోన్న రెండు పార్టీలు లోక్ సభలో కేంద్రానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలిపాయి. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అమలుపరిచి రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు ప్ల కార్డులతో నిరసన చేపట్టారు.
వెల్‌లోనే టీడీపీ ఎంపీలు, వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సమయంలో వైఎస్సార్సీపీ పార్టీ తరపున కర్నూలు నుంచి ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక మాత్రం వెల్‌లో అటు టీడీపీ ఎంపీలతో కానీ లేదా ఇటు వైఎస్సార్సీపీ ఎంపీలతో కానీ కలవకుండా తన సీటు నుంచే లేచి నిలబడి నిరసన తెలపడం మీడియా దృష్టిని ఆకర్షించింది.
సభకు హాజరైన వైఎస్సార్సీపీ ఎంపీలు సభ వెలుపల సైతం ప్ల కార్డులతో నిరసన తెలిపి ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.