AP Election Results: జగన్‌ దారుణ ఓటమికి కారణాలు ఇవే.. అవే చావుదెబ్బ తీశాయా?

These Is The Reasons Of YSRCP Crushing Defeat In AP Assembly Election Results: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంచలన తీర్పుతో వైఎస్‌ జగన్‌ను చావు దెబ్బ తీశారు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో తీర్పునివ్వడం చూస్తుంటే ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. జగన్‌ ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 4, 2024, 01:11 PM IST
 AP Election Results: జగన్‌ దారుణ ఓటమికి కారణాలు ఇవే.. అవే చావుదెబ్బ తీశాయా?

YSRCP Crushing Defeat: దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన తీర్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమ ఓటుతో విలక్షణ తీర్పునిచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రభంజనం ఇచ్చిన ఓటర్లు ఇప్పుడు అదే విధమైన తీర్పును టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చారు. అయితే ఊహించని రీతిలో ప్రజలు తీర్పునివ్వడం యావత్‌ దేశాన్నే విస్మయానికి గురి చేసింది. ఇంతటి భారీ విజయాన్ని అందిస్తుందని కూటమి నాయకులే ఊహించలేకపోయారు. అయితే ఇంతటి దారుణ పరాభవం ఎదుర్కొంటారని ఏ సర్వేలోనూ తేలలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా ప్రజల తీర్పు ఉండడం యావత్‌ దేశాన్ని ఆకర్షించింది. అయితే చావు దెబ్బ తినడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.

Also Read: YS Jagan Viral Tweet: ఎన్నికల ఫలితాల ముందు సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన ట్వీట్‌..

సాధారణంగా ఐదేళ్ల ప్రభుత్వానికి ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉండడం ఎక్కడా చూడలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఫలితం రావడం చూస్తుంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తెలుస్తోంది. చావు దెబ్బ తగలడం వెనుక ప్రధాన కారణం మాజీ సీఎం జగన్‌ వైఖరి అని తెలుస్తోంది. జగన్‌ మొండి వైఖరి ఆ పార్టీని కొంప ముంచిందని తెలుస్తోంది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉంది. ఈ కారణం చేతనే జగన్‌ అనూహ్యంగా దాదాపు సగం మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేశారు. అభ్యర్థులను నమ్మకపోవడం ఇది ప్రజల్లో ఆలోచన తీసుకువచ్చింది.

Also Read: YS Jagan Viral Post: సరిగ్గా ఈరోజు జరిగిందే పునరావృతం.. ఇది తథ్యం: వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ వైరల్‌

 

రాజధాని అంశం
ప్రధానంగా దెబ్బతీసినది చెప్పాలంటే రాజధాని అంశం. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీని తీవ్ర దెబ్బ తీసింది. అమరావతిని కాదని విశాఖపట్టణానికి పరిపాలన మారుస్తానని చెప్పడం ఎవరికీ నచ్చలేదు. కర్నూలు, అమరావతి, విశాఖపట్టణం మూడు రాజధానులుగా నిర్మిస్తామని జగన్‌ మొండిగా ముందుకు వెళ్లారు. రాజధాని అంశం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది.

బటన్‌ నొక్కుడు
ఐదేళ్ల పరిపాలనలో జగన్‌ బటన్‌ నొక్కడమే చేశారు. వివిధ వర్గాల ప్రజలకు డబ్బులు పంచుతూ పరిపాలన చేశారు. అమ్మఒడి మొదలుకుని ఆటో డ్రైవర్లకు సహాయం వరకు అన్నింటా జగన్‌ నెలకోమారు డబ్బులు పంచుడు కార్యక్రమం చేశారు. ఇది తీవ్రంగా దెబ్బతీసింది.

అభివృద్ధి గాలికి..
తన పరిపాలన కాలంలో జగన్‌ అభివృద్ధిని విస్మరించారు. వైసీపీ పాలనలో ఏపీకి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఉన్న పరిశ్రమలు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. రాష్ట్రంలో అభివృద్ధి జాడ అనేది కనిపించలేదు.

మౌలిక సౌకర్యాలు
అధికారంలోకి వచ్చాక జగన్‌ మౌలిక అవసరాలను పట్టించుకోలేదు. ఏపీలో ఉన్న రోడ్లపై దేశవ్యాప్తంగా చర్చ నడించింది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న రోడ్లను ఏపీ రోడ్లను పోలుస్తూ ట్రోల్స్‌ భారీగా ఉన్నాయి.

హామీలు నెరవేర్చకపోవడం
నవరత్నాల పేరిట అధికారంలోకి వైఎస్‌ జగన్‌ తన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా యువతకు కల్పించాల్సిన ఉద్యోగాల విషయంలో భారీ మోసం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు. మెగా డీఎస్సీ పేరిట తక్కువ ఉద్యోగాలిచ్చి మోసం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక.. ప్రైవేటు ఉద్యోగాలు చేద్దామంటే పరిశ్రమలు రాకపోవడంతో యువత జగన్‌పై తీవ్ర ఆవేశంలో ఉన్నారు. యువత మొత్తం గంపగుత్తగా కూటమికి ఓట్లు వేశారు.

కక్ష సాధింపు
అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ కక్ష సాధింపు రాజకీయాలు చేశారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులను అణచివేశారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కాబోయే సీఎం చంద్రబాబు నాయుడును జైలుకు పంపడం అందరిలోనూ ఆలోచన రేకెత్తించింది. కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు సహించలేకపోయారు.

పరిపాలన లోపం
గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్‌ సద్వినియోగం చేసుకోలేదని విమర్శలు ఉన్నాయి. పరిపాలన అనుభవం లేకపోవడంతో పాలనలో తన మార్క్‌ చూపించలేకపోయారు. ప్రభుత్వం అంటే డబ్బులు పంచడమే అనే చందంగా మార్చేశారు. రాష్ట్రంపై ఒక అవగాహన లేకుండా పరిపాలన చేశారు.

పార్టీలోనే అసంతృప్తి
అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వలేదు. పార్టీలో చుట్టూ కొంతమంది ఉండడంతో జగన్‌ పార్టీ శ్రేణులకు దూరమయ్యారు. జగన్‌ను కలవాలంటే ఆయన చుట్టూ ఉన్న పెద్ద తలకాయలు ఆంక్షలు విధించేవారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా స్వేచ్ఛ లేకుండాపోయింది. ఒక విధమైన అహంకారం, నియంతృత్వ వ్యవస్థ నడిచింది. అధికారంలోకి వచ్చాక పార్టీ శ్రేణులను ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేసుకునే అవకాశం కల్పించలేదు.

ల్యాడ్‌ యాక్టింగ్‌ చట్టం
ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చిన అంశం ల్యాండ్‌ యాక్టింగ్‌ చట్టం. కూటమికి ఈ చట్టం ప్రధాన అస్త్రంగా మారింది. జగన్‌ వస్తే మీ ఆస్తులు లాక్కుంటాడని చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీనికి వైసీపీ గట్టి బదులు ఇవ్వలేకపోయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News