close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్; ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు !!

ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది  

Updated: Jul 23, 2019, 12:23 PM IST
ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్; ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు !!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలి సస్పెన్షన్ కు సభాపతి శ్రీకారం చుట్టారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఇది అమల్లో ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రూలింగ్ ఇచ్చారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. 
అసలు ఏం జరిగిందంటే...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభంకాగానే స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ కోనారఘుపతి ప్రశ్నోత్తరాల సెషన్ కు అనుమతి ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్‌, పంచాయతీరాజ్ శాఖలో నిలిచిపోయిన పనులపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు అడగ్గా.. సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు  ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి వివరణతో సంతృప్తి చెందని
 టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీ ఎన్నికల హామీపై స్పష్టత ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. 

సస్పెన్షన్ ఓకే చెప్పిన డిప్యూటీ స్పీకర్
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను శాసనసభా వ్యవహారాల  మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో ఏకీభవించిన డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి .. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుపై వేటు వేశారు. సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని రూలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు సభను వీడలేదు. అక్కడే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మార్షల్స్‌ బలవంతంగా వారిని బయటకు తీసుకెళ్లిపోయారు.