విశాఖలో మన్యంలో ఆంత్రాక్స్ కలకలం

విశాఖ మన్యంలో ఇద్దరు గిరిజనులకు ఆంత్రాక్స్ లక్షణాలతో కూడిన బొబ్బలు రావడం కలకలం సృష్టించింది.

Last Updated : Apr 2, 2018, 04:30 PM IST
విశాఖలో మన్యంలో ఆంత్రాక్స్ కలకలం

విశాఖపట్టణం: విశాఖ మన్యంలో ఇద్దరు గిరిజనులకు ఆంత్రాక్స్ లక్షణాలతో కూడిన బొబ్బలు రావడం కలకలం సృష్టించింది. చింతపల్లి మండలం తాజంగి పంచాయితీ శివారు గొడుగుమామిడి గ్రామానికి చెందిన పాంగి చిన్నారావు, కొర్రా నాగేశ్వరరావుల చేతులపై ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఆదివారం సమాచారం అందుకున్న రెవిన్యూ, వైద్య సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకొని బాధితులను వెంటనే కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించారు.

ఈ గ్రామంలో పాము కాటుతో గతనెల 20న ఒక ఆవు చనిపోయింది. బాధితులిద్దరూ ఆవు చర్మాన్ని తొలగించి మాంసాన్ని వేరుచేసే పనులు చేపట్టారు. ఈ గ్రామంలో 51 కుటుంబాలు ఉండగా వారంతా మృతి చెందిన ఆవు మాంసాన్ని తిన్నట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని తహసిల్దార్, ప్రత్యేకాధికారి తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి మందులు ఇస్తున్నారు. పంచాయితీ సిబ్బంది పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత చర్యగా వైద్య సిబ్బందిని గ్రామంలోనే ఉంచి పరిస్థితిని గమనిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Trending News