Vijayawada: ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఎన్నికల సమీక్షలు ప్రారంభమైపోయాయి. రాష్ట్రంలో కీలకమైన విజయవాడ స్థానం కోసం వైసీపీ కొత్త వ్యూహం పన్నింది. టాలీవుడ్ అగ్రహీరోను రంగంలో దింపడం దాదాపుగా ఖరారైంది.
ఏపీలో 151 సీట్లతో 2019లో అధికారాన్నిచేజిక్కించుకున్నా..కీలకమైన విజయవాడ ఎంపీ స్థానాన్ని మాత్రం వైసీపీ కోల్పోయింది. 2019లోనే కాదు..2014లో కూడా విజయవాడ ఎంపీగా టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని గెలిచారు. 2019లో వైసీపీ విజయవాడ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. విజయవాడ లోక్‌సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఆరింట వైసీపీ విజయం సాధించినా..పార్లమెంట్ స్థానం మాత్రం టీడీపీకే వెళ్లింది. అంటే పెద్ద ఎత్తన క్రాస్ ఓటింగ్ జరిగింది.
గతంలో రెండుసార్లు మిస్సయిన విజయవాడ స్థానాన్ని ఈసారి అంటే 2024 ఎన్నికల్లో ఎలాగైనా చేజిక్కించుకోవాలని వైసీపీ ఇప్పట్నించే సన్నాహాలు చేస్తోంది. సరైన అభ్యర్ధిని రంగంలో దింపడమే కాకుండా..క్రాస్ ఓటింగ్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జునను రంగంలో దింపనున్నట్టు దాదాపుగా తెలుస్తోంది. తాడేపల్లిలో జరిగిన పార్టీ పెద్దల అంతర్గత సమావేశంలో ఇదే విషయం చర్చకు వచ్చినట్టుగా సమాచారం. విజయవాడలో వైసీపీ అభ్యర్ధిగా నాగార్జున బరిలో నిలిస్తే..కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్కు లాభిస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
వైఎస్ జగన్‌తో నాగార్జునకు చాలాకాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. వైఎస్ జగన్ జైళ్లో ఉన్నప్పుడు సైతం నాగార్జున జగన్‌ను కలిశారు. సోషల్ మీడియాలో సైతం ఇదే వార్త విస్తృతంగా ప్రచారమౌతోంది. కేశినేని నానికి అనేకంటే టీడీపీకు విజయవాడలో చెక్ పెట్టాలంటే ఎంపీ స్థానాన్ని తప్పకుండా గెలవాలనేది వైసీపీ ఆలోచన. అందుకే టాలీవుడ్ హీరో నాగార్జున పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. నాగార్జునను వైసీపీ విజయవాడ పార్లమెంట్ బరిలో నిలబెట్టనుందనే వార్తలు రెండ్రోజుల్నించి చక్కర్లు కొడుతున్నా..అటు వైసీపీ వర్గాలు గానీ, ఇటు నాగార్జున గానీ స్పందించలేదు.
Also read: AP Politics: ఏపీలో ప్రతిపక్షం ఏకం కాదా..జగన్ వ్యూహానికి బీజేపీ అధిష్టానం మద్దతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook