ఏపీ సర్కార్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ ప్లాన్ ?

పాద యాత్ర అనంతరం బస్సు యాత్రకు సిద్ధమవుతున్న వైఎస్ జగన్ !

Updated: Jan 8, 2019, 01:35 PM IST
ఏపీ సర్కార్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ ప్లాన్ ?

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ తలపెట్టిన పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ముగింపు అనంతరం సంక్రాంతి పండగ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా విదేశీ యాత్రకు వెళ్లనున్నారని తెలుస్తోంది. విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత మరోసారి బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారని, అందుకు ఫిబ్రవరి 2వ తేదీని ముహూర్తంగా అనుకుంటున్నారని సమాచారం. అయితే ఈ బస్సుయాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించి, ఎక్కడ ముగించాలనే విషయంలోనే జగన్ ఇంకా ఎలాంటి ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, ఈ బస్సు యాత్రతోనే ఇక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని జగన్ ప్రణాళికలు రచించుకుంటున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఏడాదికిపైగా సాగిన పాదయాత్రతో చాలా ప్రాంతాలు కవర్ చేసిన వైఎస్ జగన్.. ఈ బస్సు యాత్రతో మిగతా ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలపై దృష్టిసారించేందుకు యత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రభావం వున్న 7 జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే సందర్భంలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నాయి. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రజల దీర్ఘకాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. అదే కానీ జరిగితే, ఫిబ్రవరి నుంచే సర్కార్ ఒక రకంగా నామమాత్రపు పాత్రకే పరిమితం కానుండటం కూడా జగన్‌కి కలిసొచ్చే అంశం కానుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.