యువతరం వేసే ప్రతి అడుగు కీలకం..ప్రతి నిర్ణయం భవిష్యత్తును శాసిస్తుంది. సమాజ భవిష్యత్తు యువశక్తి పైనే ఆధారపడి ఉంది. అలాంటి యువశక్తిని హరించే విధంగా స్మార్ట్ మైబైల్ తయారైందంటున్నారు అమెరికా పరిశోధకులు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం దీనికి తోడు ఇంటర్నెట్, సోషల్ మీడియా జతకావడం వంటి పరిణమాలు యువతకు ఎక్కువ సమయం ఫోన్లతో గడిపేలా చేస్తోందని అమెరికా శాన్‌డియాగో వర్శిటీకి చెందిన పరిశోధకులు విశ్లేషించారు.
పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ ప్రకారం యువతీ యువకుల్లో దాదాపు 24 శాతం మంది ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూ ..చూస్తూ ఆన్ లైన్లోనే ఉంటున్నారని తేలింది. అయితే ఇలాంటి విపరీత ధోరణిలో స్మార్ట్ ఫోన్ వాడకం మానవ సంబంధాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని.. క్రమంగా ఇది ఆత్మహత్యల లాంటి తీవ్ర నిర్ణయాలకు కారణమౌతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన సెల్‌ఫోన్ వినియోగం యువతరాన్ని సర్వనాశనం చేస్తున్నట్లు శాన్‌డియాగో విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాంకేతికను అందుకోవడం తప్పుకాదు కానీ..దాన్ని దుర్వినియోగం చేయడం వల్లే దుష్పపరిణాలు చోటు చేసుకుంటున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.
హ్యూమెన్ రిలేషన్స్ పై ప్రభావం..
మొబైల్ వినియోగం ఎక్కవశాతం కాలక్షేపం కోసం చేస్తున్నట్లుగా శాండియాగో వర్శిటీ ఫ్రొఫెసర్ జీన్ ఎం ట్వెంగో నిర్ధారించారు. స్మార్ట్ ఫోన్ విప్లవం తర్వాత యువతలో భావావేశం క్రమక్రమంగా తగ్గితూ వస్తోందని చెబుతున్నారు. దీనివల్ల యుక్తవయస్సులో స్వతహాగా కలిగే నైపుణ్యాలకు వారు దూరం అవుతున్నారని... చక్కగా మాట్లాడటం, ఎదుటివారిని కలవటం, తమనుతాము పరిచయం చేసుకోవటం, భావాలు పంచుకోవటం అనేది తగ్గిపోయాయని విశ్లేషించారు. తల్లిదండ్రులతో కలిసి ఎక్కడైన బయటకు వెళ్లే సందర్భాలు లేకుండా పోయాయి. ఒకే ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులకు యువత మానసికంగా దగ్గర కాలేకపోతున్నారు. ఎక్కువగా స్నేహితులతో కలిసి మాట్లాడుకోవడం కూడా తగ్గిపోయిందని.. సరదాగా విహారయాత్రలకు వెళ్లడం తగ్గిపోయిందంటున్నారు. వీటన్నిటికీ కారణం స్మార్ట్ ఫోన్ అని విశ్లేషించారు.
ఆత్మహత్యలకు దారి తీస్తున్న వైనం..
మొబైల్ తో ఎక్కువ సమయం గడిపే వారు..తమకు ఏదైన సమస్య వస్తే ఎదుటివారికి చెప్పులేని విధంగా తయరై డిప్రెషన్ కు లోనవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీని ఫలితంగా ఆత్మహత్యల సంఖ్య అధికం అయింది. తాజా సర్వే ప్రకారం అమెరికాలో డిప్రెషన్ సమస్య బారిన పడే వారి సంఖ్య 2012 నుంచి 2015 మధ్యకాలంలో 21 శాతం పెరిగిందని.. ముఖ్యంగా ఈ సమస్య యువకుల కంటే యువతుల్లో ఎక్కువగా (50 శాతం ) పెరిగిందని వెల్లడించారు. 2007తో పోల్చితే 2015 లో 14 ఏళ్ల యువతుల అత్మహత్యల రేటు మూడు రెట్లు పెరిగిందన్నారు. హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోవడం ఒంటరితనానికి దారితీసి డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు దారి తీస్తోందని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పరిష్కారం ఎలా..?
యువతకు స్మార్ట్ ఫోన్ల ,.సోషల్ మీడియా వ్యసనం నుంచి బయటకు తీసుకురావటం కష్టమే. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే కొంత మార్పు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లపై రోజుకు గంట కంటే ఎక్కువ సమయం వెచ్చించకుండా జాగ్రత్త వహించాలి, మిగిలిన సమయంలో పుస్తకాలు చదువుకునే విధంగా, స్నేహితులను కలవటం, షికారుకు వెళ్లటం వంటి అలవాట్ల వైపు వారు మొగ్గుచూపే విధంగా చేస్తే మార్పు వస్తుందంటున్నారు. దీనివల్ల యవతను వేధిస్తున్న డిప్రెషన్ సమస్య తో పాటు పలు రకాల మానసిన సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.