'పద్మావతి'తో జీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

శుక్రవారం జీ మీడియాతో దీపికా పదుకొనె మాట్లాడారు. పద్మావతి చిత్రంపై స్పందించారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందన్నారు.

Last Updated : Nov 18, 2017, 11:19 AM IST
    • నాకు చట్టం మీద పూర్తి నమ్మకం ఉంది
    • నా సినీ జీవితంలో 'పద్మావతి' ప్రత్యేకం
    • ఈ సినిమా చేయటానికి రెండేళ్లు పట్టింది
    • జీ మీడియాతో దీపికా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
'పద్మావతి'తో జీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

పద్మావతి చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం, ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకొనె మీద బెదిరింపుల పర్వం కొనసాగుతున్న తరుణంలో తాజాగా రాజ్ పుత్ కర్ణిసేన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్ పుత్ కర్ణిసేన సినిమా విడుదలను నిరసిస్తూ డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అంతేకాదు.. 'సూర్పనక ముక్కులాగా దీపికా ముక్కు కోస్తాం. వాస్తవాలను తప్పుదోవ పట్టించి భన్సాలీ ఈ సినిమా తెరకెక్కించాడు. వారికి తగిన గుణపాఠం చెప్పి తీరుతాం'అని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎవరో అజ్ఞాత వ్యక్తి దీపికా, భన్సాలీ తల నరికి తీసుకొచ్చిన వారికి 5 కోట్లు ఇస్తాం' అన్నాడు. రాజస్థాన్ లో ఆందోళనకారులు రెచ్చిపోయి కోటలో ఆకాశ్ మాల్ పై విరుచుకుపడి ధ్వంసం చేసారు. బెదిరింపులు వెలువడిన నేపథ్యంలో దీపికాకు, భన్సాలీకి భద్రత కట్టుదిట్టం చేశారు. 

ఈ వివాదానికి అసంతృప్తి చెందిన దీపికా శుక్రవారం జీ మీడియాతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూను నిర్వహించి, ఈ చిత్రంపై తన భావాలను వ్యక్తం చేశారు. 'పద్మావతి' చిత్రం విడుదలకు సంబంధించిన సంక్షోభంపై దీపికా పదుకొనె మాట్లాడుతూ.. నాకు చట్టంపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. అంతేకాదు, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. దీపికా మాట్లాడుతూ, "నేను సంజయ్ లీలా భన్సాలికి కృతజ్ఞురాలిని. నేను ఆయనకు (సంజయ్ లీలా భన్సాలి) ధన్యవాదాలు చెప్పటానికి మాటలు సరిపోవు' అన్నారు. 

జీ మీడియా : ఈ మొత్తం వివాదం ఎలాంటి ప్రభావాన్ని చూపింది?   

దీపికా:  ఒక మహిళ, దర్శకుడు, ఇంతమంది కళాకారులు రెండు సంవత్సరాల జీవితాన్ని ఈ సినిమాకు త్యాగం చేశారు. నాకు చాలా బాధగా ఉంది, కోపం కూడా వస్తోంది. నాకు చట్టం మీద పూర్తి విశ్వాసం ఉంది. 

జీ  మీడియా:  రెండు సంవత్సరపు చిత్ర నిర్మాణ సమయంలో మీ స్పందన ఏమిటి? 

దీపికా : పద్మావతి లాంటి సినిమాకు రెండు సంవత్సరాల సమయం సరైందే. ఇలాంటి సినిమాలకు అంత సమయం తప్పక తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమాలో నేను నటించడానికి ముందు అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. నేను వాటిని వదులుకున్నాను. రెండు సంవత్సరాలు  సామాజిక, కుటుంబ జీవితానికి కూడా దూరమయ్యాను. ఈ సినిమా నా సినీ జీవితంలో చాలా ప్రధానమైనదిగా భావిస్తున్నాను. 

అదే సమయంలో, 'పద్మావతి' కి నిరసనగా రాజస్థాన్ లోని ప్రసిద్ధ చిత్తోర్ ఘర్ కోటను శుక్రవారం (నవంబర్ 17) మూసివేశారు. చలన చిత్రంలో చారిత్రక వాస్తవాలు పాడుచేశారని చెప్పారు. అంతకు ముందు ఆల్ సోషల్ ప్రొటెస్ట్ కమిటీ సభ్యుడు రాంజిత్ సింగ్ మాట్లాడుతూ, "చిత్తోర్ ఘడ్ కోటలోని పదన్ పోల్ గేట్ పేరుతో ఉన్న ఎంట్రెన్స్ ద్వారాన్ని ఉదయం 10 గంటలకు మూసేస్తాము, కోటలోకి ఎవ్వరినీ అనుమతించము. ఇది శాంతియుత నిరసన మరియు 6 గంటల వరకు కొనసాగుతుంది" అన్నారు. 

'పద్మావతి'పై అదితి రావ్ హైదరీ - 'సంజయ్ లీలా భన్సాలి గర్వపడాలి'

కొన్ని రోజుల క్రితం సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. దీనికి ప్రేక్షకుల వద్ద నుంచి మంచి స్పందన వచ్చింది. దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ మరియు షాహిద్ కపూర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా, సినిమాను మహారాణి పద్మావతి ఆధారంగా తెరకెక్కించారు. రాణి పద్మావతి పాత్రలో దీపికా నటించారు. అంతేకాకుండా, రాజా రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్  ప్రతికూల పాత్రను పోషించే అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో కనిపించనున్నారు. 

'పద్మావతి' విడుదల వాయిదా ?

పద్మావతి చిత్రం ఈ ఏడాది నవంబర్ 17 న విడుదల కావాల్సి ఉంది. కానీ వివాదాలు చుట్టుముట్టడంతో  డిసెంబర్ 1 న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సినిమాపై ఇంకా వివాదాలు పెరిగిపోవడం, అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని చెప్పడం, బెదిరింపులకు పాల్పడటం, తలలు తీసుకొస్తే 5 కోట్లు, థియేటర్లు తగుల బెడతాం, దీపికా ముక్కు కోస్తాం లాంటి వ్యాఖ్యలు లాంటి సంఘటనల నేపథ్యంలో రిలీజ్ డేట్ ను పొడిగిస్తారా? అన్న సందేహం కలుగుతోంది. ఒకవేళ అలా జరిగితే జనవరి 12 వరకు వేచిచూడాల్సిందే..!

Trending News