నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక, నిత్యామీనన్, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, అభయ్ తదితరులు
సంగీతం : గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్ : మణికందన్
సమర్పకులు : అల్లు అరవింద్
నిర్మాత : బన్నీ వాసు
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం : పరుశురామ్
విడుదల తేది : 15 ఆగస్ట్ 2018
సెన్సార్ : U/A
కథ :
కాలేజిలో లెక్చరర్‌గా పనిచేసే విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) తనకు కాబోయే భార్య గురించి ఏవేవో కలలు కంటూ ఉంటాడు. తన భార్యలో చనిపోయిన తన అమ్మను చూసుకోవాలనుకుంటాడు. అలాంటి లక్షణాలున్న అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో గుడిలో గీత (రశ్మిక)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే వీరిద్దరి మధ్య ఊహించని ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ సంఘటనతో గీతకు గోవింద్ అంటే విపరీతమైన ద్వేషం పెరుగుతుంది. ఈ క్రమంలో తమ మధ్య జరిగిన సంఘటన ఇద్దరి మధ్యే ఉండాలని గీతను రిక్వెస్ట్ చేస్తాడు గోవింద్. ఇంతకీ గీత-గోవింద్ మధ్య జరిగిన ఆ అనుకోని సంఘటన ఏంటి… ఫైనల్‌గా గీత- గోవింద్‌లు ఎలా ఒకటయ్యారు అనేదే గీతగోవిందం కథ.
నటీనటుల పనితీరు :
మంచి క్యారెక్టర్ పడితే విజయ్ దేవరకొండ ఇరగదీస్తాడనే విషయం 'అర్జున్ రెడ్డి'తో అందరికీ అర్థమైంది. ఇప్పుడు అలాంటిదే మరో క్యారెక్టర్ పడింది. గీతగోవిందం సినిమాలో విజయ్ గోవింద్‌గా దేవరకొండ దుమ్ముదులిపాడు. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో కీలకమైన సీన్‌ను ఒంటిచేత్తో నిలబెట్టాడు. 'అర్జున్ రెడ్డి'తో యూత్‌కు కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ, ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. ఇక రష్మిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గీత పాత్రలో ఆమె యాక్టింగ్ సింప్లీ సూపర్బ్. సినిమా మొత్తాన్ని వీళ్లిద్దరే నడిపించారు.
వీళ్ల తర్వాత ఆకట్టుకున్నది ఇద్దరే ఇద్దరు. వాళ్లే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ. గతంలో సినిమా సెకెండాఫ్‌లో బ్రహ్మానందం వస్తే ప్రేక్షకులు ఎంతలా ఎంజాయ్ చేసేవాళ్లో.. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఎంట్రీ కూడా అలానే ఉంటోంది. చాలా సినిమాల్లో సెకండాఫ్‌లో కనిపించి కామెడీ పంచే ఈ హాస్యనటుడు ఇందులో కూడా తన టైమింగ్‌తో అదరగొట్టాడు. ఇక ఫస్టాఫ్‌లో హీరో ఫ్రెండ్‌గా రాహుల్ రామకృష్ణ కూడా బాగానే నవ్వించాడు. వీళ్లతో పాటు ఇతర క్యారెక్టర్స్ పోషించిన సుబ్బరాజు, నాగబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, దువ్వాసి మోహన్ తమ క్యారెక్టర్స్‌కు న్యాయం చేశారు.
టెక్నిషియన్స్ పనితీరు:
ఒక మంచి సినిమాకు అన్నీ కలిసొస్తాయి అన్నట్టు ఈ సినిమాకు టెక్నిషియన్స్ కూడా బాగా కలిసొచ్చారు. ముఖ్యంగా గోపీ సుందర్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. రిలీజ్‌కి ముందే ఆల్బంతో పాజిటీవ్ వైబ్స్ తీసుకొచ్చిన గోపీ సుందర్ సినిమాకు పర్ఫెక్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక సినిమాటోగ్రాఫర్ మణికందన్ తన విజువల్స్‌తో మూవీని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాడు. సాంగ్స్ పిక్చరైజేషన్లో కూడా అతని పనితనం కనిపించింది. మార్తాండ్ కే. వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్గా ఎడిట్ చేశారు.
ఆర్ట్ వర్క్ బాగుంది. అనంత్ శ్రీరాం , శ్రీమణి, సాగర్ నారాయణ అందించిన సాహిత్యం బాగుంది. పరుశురాం డైలాగ్స్‌తో పాటు స్క్రీన్ ప్లే కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచింది. పరశురాం మరోసారి రచయితగా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. గీతా ఆర్ట్స్-2 ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
పరశురాం సినిమాల్లో హీరో ఎప్పుడూ ఎంతో ఉన్నతంగా ఉంటాడు. మరీ ముఖ్యంగా కాబోయే భార్య విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాడు. సోలో సినిమాలో నారా రోహిత్ అలానే ఉంటాడు. శ్రీరస్తు-శుభమస్తు సినిమాలో అల్లు శిరీష్ కూడా అంతే. ఇప్పుడు గీతగోవిందంలో కూడా విజయ్ దేవరకొండ అచ్చుగుద్దినట్టు అలానే ఉంటాడు. తనకు కాబోయే భార్యలో కొన్ని లక్షణాల్ని ఊహించుకున్న విజయ్ గోవింద్, ఆ క్వాలిటీస్‌ను గీతలో చూస్తాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడివరకు కాస్త సోలో, శ్రీరస్తు-శుభమస్తు ఛాయలు కనిపించినప్పటికీ.. తర్వాత మాత్రం సినిమా మొత్తం ఫ్రెష్‌గా ఉంటుంది.
గీత, గోవింద్.. వీళ్లిద్దరి కథే గీత గోవిందం. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీళ్లిద్దరే కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే విజయ్ దేవరకొండ, రష్మిక కనిపించరు. అంతలా గీతగోవిందం అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మంచి సన్నివేశాలు పడ్డాయి. పెర్ఫెక్ట్ ట్విస్టులున్నాయి. హిట్ సాంగ్స్ ఉన్నాయి. సిచ్యువేషనల్ కామెడీ ఉంది. మంచి ఎమోషన్ ఉంది. ఇలా 'గీతగోవిందం'లో అన్నీ ఉన్నాయి.
హీరోహీరోయిన్లతో పాటు క్యారెక్టర్స్ అన్నీ బాగా కుదిరాయి. ప్రతి క్యారెక్టర్‌కు సూట్ అయ్యే ఆర్టిస్టుల్ని తీసుకున్నాడు పరశురాం. చాన్నాళ్ల తర్వాత సుబ్బరాజుకు మంచి క్యారెక్టర్ పడింది. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి’ పాటను సినిమాలో సరిగ్గా వాడుకోలేకపోయారు. ఆడియో పరంగా సూపర్ హిట్ అయిన ఈ సాంగ్, విజువల్స్ పరంగా ఆ స్థాయిలో ఆకట్టుకోదు.
అయితే ఇలాంటి చిన్నచిన్న మైనస్ పాయింట్స్ అన్నీ కథ క్లయిమాక్స్ వచ్చేవరకే. గీతకు హీరో గురించి నిజం తెలిసేంత వరకే. ఆ తర్వాత ఇక సినిమా పరుగులుపెడుతుంది. అదే ఊపులో క్లయిమాక్స్‌కు చేరుకొని కథ సుఖాంతం అవుతుంది.
ఇక్కడ ప్రత్యేకంగా క్లయిమాక్స్ గురించి చెప్పుకోవాలి. పరశురాం రైటింగ్‌కు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. స్టార్టింగ్‌లో హీరో తన బాధను చెప్పుకోవడానికి నిత్యామీనన్ లాంటి స్టార్‌ను ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడో, క్లయిమాక్స్ వరకు వెయిట్ చేస్తే కానీ అర్థంకాదు. నిత్యామీనన్ ఇచ్చిన సలహాతోనే కథకు శుభంకార్డు పడుతుంది. దీంతో పాటు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పరశురాం తన మార్క్ చూపించాడు. మరోసారి ప్రేక్షకులకు క్లీన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఓవరాల్‌గా గీతగోవిందం సినిమా ఓ పక్కా రొమాంటిక్-ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అటు కుర్రాళ్లను ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది.
బాటమ్ లైన్ – గోవింద్ మళ్లీ హిట్ కొట్టాడు
రేటింగ్ – 3.25 /5
జీ సినిమాలు సౌజన్యంతో...