"సూపర్ స్టార్" కృష్ణ నటనా ప్రస్థానం

Last Updated : Sep 26, 2017, 12:50 PM IST
"సూపర్ స్టార్"  కృష్ణ నటనా ప్రస్థానం

సూపర్ స్టార్ కృష్ణగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు. కృష్ణ 1942 మే 31 తేదీన గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో శ్రీ వీరరాఘవయ్య చౌదరి, శ్రీమతి నాగరత్న దంపతులకు జన్మించారు. బి.యస్.సి. వరకు చదువుకున్నారు.1962 లో ప్రారంభమైన తన సుదీర్ఘ కెరీర్లో ఐదు దశాబ్దాలపాటు 350 చిత్రాలలో నటించారు.ఇతడు ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.యస్సీ చదువుతుండగా సినీ రంగంలోకి రావాలనే ఆలోచనను పెంచుకున్నారు.ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో 'చైర్మన్' వంటి అనేక నాటికల్లో, నాటకాల్లో పాల్గొని నటనపై అవగాహనపెంచుకున్నారు. అలాగే మద్రాసులో నటనావకాశాల కోసం ప్రయత్నిస్తున్న శోభన్‌బాబుతో కలిసి  కూడా కొన్ని నాటకాల్లో నటించారు. అలాగే జగ్గయ్య నిర్మించిన ' పదండి ముందుకు ' సినిమాలో కృష్ణ చిన్న పాత్ర పోషించారు.

1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నట్టు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఫొటోలు పంపిన కృష్ణకు మద్రాసు రమ్మని కబురొచ్చింది. స్క్రీన్ టెస్ట్ చేసి కృష్ణను హీరోగా ఎంపిక చేసారు. ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా వున్న కె.విశ్వనాథ్ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్ డ్యాన్సు చెయ్యడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనెమనసులు' కృష్ణని హీరో చేసి నిలబెట్టింది.

తొలి చిత్రం "తేనె మనసులు" హిట్ కావడంతో ఏకంగా 20 సినిమాలకు సైన్ చేశారు. గూఢాచారి 116, ఇద్దరు మొనగాళ్లు, అసాధ్యుడు, కన్నె మనసులు మొదలైన చిత్రాల్లోనటించారు. ఆ తర్వాత చిత్రకారుడు బాపు తీసిన పూర్తి అవుట్ డోర్ చిత్రం 'సాక్షి' కృష్ణ ఇమేజిని పూర్తిగా పెంచింది. ఆ తర్వాత  'మరపురాని కథ' చిత్రంతో దర్శకుడువి. రామచంద్రరావుతో కృష్ణకు మంచిస్నేహం ఏర్పడింది. చారిత్రక చిత్రం 'అల్లూరి సీతారామరాజు' నిర్మించే వరకు  రామచంద్రరావు కృష్ణతో మొత్తం 13 చిత్రాలకు పనిచేసారు.1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మూడు చిత్రాలు విజయనిర్మలతో నటించినవి.తొలి 30 సంవత్సరాల్లో కృష్ణ ఏకబిగిన 296 సినిమాల్లో నటించడం ఒక అరుదైన రికార్డు. కిరాయి కోటిగాడు, అగ్ని పర్వతం, వజ్రాయుధం, ప్రజారాజ్యం, కంచు కాగడా, పచ్చన కాపురం, మహా సంగ్రామం, ఖైదీ రుద్రయ్య, ముద్దాయి, అశ్వథ్థామ, గూండా రాజ్యం, నెంబర్ వన్, అమ్మదొంగ, పచ్చని సంసారం మొదలైనవి కృష్ణ నటించిన ఇతర హిట్ చిత్రాలు. 

సినిమా రికార్డులు :

* తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రంగా రికార్డులకెక్కిన "మోసగాళ్లకు మోసగాడు"ను 1971లో నిర్మించారు. హాలీవుడ్ చిత్రాలను ప్రేరణగా తీసుకొని రూపొందించిన ఈ  చిత్రం "ది ట్రెజర్ ఐలాండ్" పేరుతో ఆంగ్లంలోకి కూడా అనువాదమైంది

* తెలుగులో తొలి 70 ఎంఎం చిత్రంగా "సింహాసనం" (1986) చిత్రం రికార్డులకెక్కింది. 

* తెలుగులో తొలి డీటీఎస్ చిత్రంగా "తెలుగు వీర లేవరా" (1998) రికార్డులకెక్కింది

* అవార్డులు, రివార్డులు

* నంది పురస్కారం (ఉత్తమ నటుడు) - అల్లూరి సీతారామరాజు (1974)

* ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం (1997)

* ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003)

* ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు (2008)

* భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్ పురస్కారం (2009)

Trending News