ఈ మధ్యకాలంలో రాజస్థాన్‌లో ఏనుగుపిల్లలను అక్రమంగా తరలించే పద్ధతులు ఎక్కువయ్యాయి. సర్కస్ లాంటి చోట్ల ప్రదర్శనలు ఇప్పించడానికి ఈ ఏనుగుపిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంటారు. ఆ శిక్షణ కొన్ని సందర్భాల్లో చాలా అమానవీయంగా ఉంటుంది. కొన్ని హింసాత్మక పద్ధతులను కూడా ఉపయోగించి శిక్షణను ఇస్తుంటారు.
ఇటీవలే ఇలాంటి శిక్షణ కోసం సుమన్ అనే పేరు గల ఓ చిన్న ఏనుగు పిల్లను జైపూర్ నుండి వేరే ప్రాంతానికి తరలించారు. అక్కడ ఓ చీకటి గదిలో దానిని బంధించి హింసకు గురిచేస్తున్నట్లు వైల్డ్ లైఫ్ సాస్ అనే సంస్థ మీడియాకి తెలిపింది. అంతే కాకుండా ఆ ఏనుగుపిల్లను కాపాడడానికి ప్రభుత్వానికి విన్నవించింది. అందుకోసం పిటీషను కూడా ఫైల్ చేసింది. #SaveSuman అనే పేరుతో ఆ సంస్థ ఆన్ లైన్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది.
ఈ ఆన్లైన్ క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. సిద్దార్థ మల్హోత్రా, కరణ్ జోహార్, వివేక్ ఒబెరాయ్, టైగర్ ష్రాఫ్ లాంటి బాలీవుడ్ ప్రముఖులందరూ ఏనుగుపిల్లను వెంటనే విడుదల చేసి అనువైన చోటుకి తరలించాలని చెబుతూ ఈ క్యాంపెయిన్‌కు మద్దతు ఇస్తూ.. తమ సోషల్ మీడియా పేజీలలో పోస్టు చేశారు. అలాగే హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, చాహెల్ లాంటి క్రికెటర్లు కూడా ఈ క్యాంపెయిన్‌కు మద్దతిచ్చారు. జంతుహింసకు స్వస్తిపలకాలని కోరారు