అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానంపై చర్చ సమయంలో బీజేపీ శాసససభాపక్ష నేత యడ్యూరప్ప కాంగ్రెస్-జేడీఎస్ ల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్-జేడీఎస్‌లది అపవిత్రమైన పొత్తు అని ఎద్దేవ చేశారు. కేవలం 37 సీట్లు సాధించిన జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దురదృష్టకరమన్నారు. 16 జిల్లాల్లో ఆ పార్టీకి సీట్లే దక్కలేదని ...అలాంటి జేడీఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని అధికారం అప్పగించడం ఆ పార్టీ ఏ స్థాయిలో దిగజారిందో అర్థచేసుకోవచ్చన్నారు.
సీఎం కుర్చీ కోసం కుమారస్వామి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తనను సీఎం చేయకపోతే బతకలేనని కుమారస్వామి ప్రజలకు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల అవకాశవాద మైత్రితో ఏర్పడిన ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి మేలు జరగదని యడ్యూరప్ప అన్నారు.
కర్నాటక ప్రజలు బీజేపీ వైపే..
కర్నాటకలో మెజార్టీ ప్రజలు బీజేపీని ఆదరించారనే విషయం ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు. పూర్తి స్థాయి మెజార్టీ లేని కారణంగా తాము ప్రతిపక్షంగా కూర్చోవాల్సి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కర్నాటక ప్రజల పక్షాన పోరాడతామన్నారు. అసలు ఫలితాలు పూర్తిగా రాకముందే జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది అని గుర్తుచేశారు. భాజపాను అధికారం నుంచి దూరం పెట్టేందుకే జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతిచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాభీష్టానికి ద్రోహం చేసిందని యడ్యూరప్ప మండిపడ్డారు.