భారతీయ సినిమాకి ట్రాజడీ క్వీన్.. మీనా కుమారి

మీనా కుమారి భారతీయ నటి, గాయకురాలు, కవయిత్రి.

Updated: Aug 1, 2018, 03:23 PM IST
భారతీయ సినిమాకి ట్రాజడీ క్వీన్.. మీనా కుమారి

మీనా కుమారి భారతీయ నటి, గాయకురాలు, కవయిత్రి. బుధవారం (ఆగస్టు 1, 2018న) గూగుల్ అలనాటి బాలీవుడ్ నటి మీనా కుమారి 85వ జయంతిని పురస్కరించుకొని ఆమె బొమ్మతో అందమైన డూడుల్‌ని ప్రచురించింది.

మీనా కుమారి ఆగస్టు1, 1933న జన్మించారు. ఆమె అసలు పేరు మహ్జబీన్ బనో. ఆమెకు ‘నాజ్‌’, ‘మున్నా’ అనే ముద్దు పేర్లున్నాయి. ఆర్ధిక సమస్యల కారణంగా  మీనాకుమారి పెద్దగా చదువుకోలేకపోయినా.. ఆమెకు ఆకలే జీవితపాఠాలను నేర్పింది. కుటుంబ పోషణ కోసం సినిమా స్టూడియోల వెంట పరుగులు తీసింది.

మీనా కుమారిని భారతీయ సినిమాకి ట్రాజడీ క్వీన్‌గా అభివర్ణిస్తారు. 30 ఏళ్ళ కెరీర్ లో దాదాపు 90 సినిమాల్లో నటించారు. ఆమె నటించిన వాటిలో ఎన్నో సినిమాలు క్లాసిక్‌లుగా నిలవడం విశేషం. మీనా కుమారి బాల నటిగా కూడా రాణించారు. ఆ తరువాత పరిణీత, తమాషా, బైజు బావరా, ఆజాద్‌, ఆదిల్‌−ఎ−జహంగీర్‌, నయా అందాజ్‌,మేమ్‌ సాబ్‌, ఏక్‌−హి−రాస్తా, బంధన్‌, శారద, మిస్‌ మేరి, యాహుది, సహారా, ఫరిస్తా, షరారత్‌, చార్‌ దిల్‌ చార్‌ రహే, దుష్మన్‌  మొదలైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 1960లో కిషోర్‌ సాహు దర్శకత్వంలో కమల్‌ అమ్రోహి నిర్మించిన ‘దిల్‌ అప్నా అవుర్‌ ప్రీత్‌ పరాయీ’ సినిమా మీనాకుమారి జీవితంలో పెద్ద మలుపును తెచ్చింది. మీనాకుమారి నటించిన తొలి కలర్‌ సినిమా ఎ.కె.నాదియాడ్‌ వాలా నిర్మించిన ‘చిత్రలేఖ'. మీనాకుమారికి ఉర్దూలో కవిత్వం రాసే ప్రజ్ఞ వుంది. కథలు, గజళ్లు కూడా రాసింది. తరువాతి కాలంలో వాటిని పుస్తకాలుగా అచ్చువేయించారు.

మీనాకుమారి భర్త పేరు కమల్‌ అమ్రోహి. ఇతను ఒక దర్శకుడు. 1952లో వీరి వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్నేళ్లపాటు వీరిద్దరి వైవాహిక జీవితం బాగుండేది. వివాహం అయిన 10 ఏళ్ల తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు, గొడవలు రావడం మొదలయ్యాయి. అలా 1964 మార్చి 5న వీరిద్దరి దాంపత్యం విచ్ఛిన్నమై పోయింది.

చెదిరిన హృదయంతో మీనాకుమారి బొంబాయిలో ఒక అపార్టుమెంటును కొనుగోలు చేసి మరణించేదాకా ఆమె శేషజీవితాన్ని అక్కడే గడిపింది. నిద్రలేమితో తాగుడు అలవాటు చేసుకుంది. ఆ అలవాటే ఆమె జీవితాన్ని క్రమక్రమంగా కబళించసాగింది. ఆమె నటించిన చివరి చిత్రం భర్త దర్శకత్వంలో వచ్చిన పాకీజా. మీనాకుమారి తన జీవితంలో నాలుగు సార్లు ఫిలింఫేర్, నాలుగు సార్లు బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డ్స్‌తో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. మార్చి 31, 1972న మీనాకుమారి తనువు చాలించారు.

మీనా జీవితచరిత్ర రాసిన వినోద్ మెహతాతో ఒక దర్శకుడు మాట్లాడుతూ, ట్రాజడీ కింగ్ అయిన దిలీప్ కుమార్ కూడా ఆమెతో నటించేటప్పుడు ఆమె అంత బాగా చేయలేక ఇబ్బంది పడేవారు అన్నారు. ఆమెతో నటించేటప్పుడు రాజ్ కుమార్ డైలాగులు మర్చిపోయేవారట. మధుబాల కూడా మీనా కుమారి అభిమాని. ఆమె మీనాకుమారి గురించి మాట్లాడుతూ ఆమె గొంతు చాలా విలక్షణమైనది. ఏ ఇతర హీరోయిన్‌కీ అలాంటి గొంతు లేదు అని అన్నారు.