మహిళా క్రికెటర్ ఆత్మ కథ: 'కౌసల్య కృష్ణ మూర్తి' హిట్టా ..ఫట్టా ?

క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన 'కౌసల్య కృష్ణముర్తి' తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు తెరపైకి ప్రత్యక్షమైంది.

Last Updated : Aug 23, 2019, 01:05 PM IST
మహిళా క్రికెటర్ ఆత్మ కథ: 'కౌసల్య కృష్ణ మూర్తి'  హిట్టా ..ఫట్టా ?

తమిళంలో సూపర్ హిట్టైన ‘కణా’ సినిమాను తెలుగులో ‘కౌసల్య కృష్ణ మూర్తి’ టైటిల్ తో రీమేక్ చేసారు. మహిళా క్రికెటర్ కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మరి భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రీమేక్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంది ? అనేది తెలుసుకోవాలని ఉందా.. ? అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.

కథ :
ఇరగవరం అనే ఊర్లో కృష్ణముర్తి అనే మధ్యతరగతి రైతు వ్యవసాయాన్ని , క్రికెట్ ని అమితంగా ఆరాదిస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. తన తండ్రి కృష్ణముర్తి( రాజేంద్ర ప్రసాద్) ప్రాణంగా భావించే క్రికెట్ ను చిన్నతనం నుండే ఇష్టపడుతుంది కౌసల్య(ఐశ్వర్య రాజేష్). ఎప్పటికైనా క్రికెటర్ గా ఎదిగి తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటుంది.

కానీ క్రికెటర్ అవ్వాలని మొదలు పెట్టిన కౌసల్య ప్రయాణంలో అడుగడుగునా ఒడిదుడుకులెదురవుతాయి. మహిళ కావడంతో తన కుటుంబం నుండి కూడా ప్రోత్సాహం లభించదు. ఆ సమయంలో తను ప్రేమించిన కౌసల్యకి అండగా నిలబడి ప్రోత్సహిస్తాడు సాయి కృష్ణ (కార్తీక్ రాజు). అయితే ఆ ఇబ్బందులనన్నిటిని దాటి కౌసల్య చివరికి తన కోచ్ నెల్సన్(శివ కార్తికేయన్) సహాయంతో ఇండియా ఉమెన్ క్రికెట్ టీంలో చోటు సంపాదించుకొని ప్రపంచ కప్ ఎలా గెలిచిందనేది సినిమా కథాంశం.

నటీ నటుల పనితీరు :
కౌసల్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటన బాగుంది. తమిళ్ లో ఇప్పటికే పాతిక సినిమాలు చేసిన అనుభవంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ‘చేసిన పాత్రే కావడంతో రీమేక్ లోనూ తన పర్ఫార్మెన్స్ తో బెస్ట్ అనిపించుకుంది. రాజేంద్ర ప్రసాద్ కృష్ణముర్తి పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కన్నీరు తెప్పించాడు. కార్తీక్ రాజు ఉన్నంతలో పరవాలేదనిపించాడు. తల్లి పాత్రలో ఝాన్సీ మంచి నటన కనబరిచింది.

కోచ్ క్యారెక్టర్ లో శివ కార్తికేయన్ మెప్పించాడు. వెన్నెల కిషోర్ ,మహేష్ ఆచంట  తమ కామెడీ టైమింగ్ తో అలరించారు. సి.వి.ఎల్‌.నరసింహారావు, రవి ప్రకాష్, విష్ణు వారి పాత్రలను  న్యాయం చేసారు.

టెన్నీషియన్స్ పనితీరు :
దిబు నినన్‌ సంగీతం సినిమాను ప్లస్ అయింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా ‘ముద్దా బంతి పూవు’ ఇలా పాట బాగా ఆకట్టుకుంది. మిగతా పాటలు కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల అందించిన సాహిత్యం పాటలకు చక్కగా కుదిరింది. ఐ. ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి లోకేషన్స్ ను బాగా చూపించాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఒరిజినల్ సినిమాను ఎగ్జాక్ట్ గా తెరకెక్కించడంతో సాంకేతిక నిపునులకి కాస్త పని తగ్గిందనే చెప్పాలి. తమిళ్ సినిమాను చూసి ఉన్నది ఉన్నట్టుగా వారి పని చేసారు. రాజేంద్ర ప్రసాద్ లుక్ పై మేకప్ మెన్ శ్రద్ధ తీసుకోవాల్సింది. ముఖ్యంగా పెట్టుడు గడ్డం అని సులువుగా పసిగట్టేసేలా ఉంది.

హనుమాన్‌ చౌదరి అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. అరుణ్‌రాజ కామరాజ్‌ అందించిన కథ, స్క్రీన్ ప్లే ఎట్రాక్ట్ చేసాయి. భీమినేని శ్రీనివాసరావు ఎలాంటి మార్పులు చేయకుండా ‘కణా’ ఉన్న ఆత్మ పోకుండా తెరకెక్కించి మెప్పించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

మూవీ రివ్యూ :

కొన్ని రీమేక్ సినిమాలను ఎటువంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తీస్తేనే బెటర్. అప్పుడే ఆడియన్స్ కథకు కనెక్ట్ అవుతారు. ‘కౌసల్య కృష్ణముర్తి’ అదే కోవలోకి వస్తుంది. కమర్షియల్ హంగుల జోలికి వెళ్ళకుండా తమిళ్ సినిమాను అచ్చుగుద్దినట్టు తెరకెక్కించడం సినిమాకు కలిసొచ్చిన అంశం. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాదించిన ‘కణా’ను తెలుగులో రీమేక్ సినిమాల దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు బాగానే డీల్ చేసాడు.

ప్రారంభంలో చిన్న చిన్న మార్పులు చేసినా అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వ్యవసాయాన్ని, క్రికెట్ ని ప్రాణంగా భావించే ఓ రైతు, ఆ రైతుని సంతోషపెట్టడానికి తన కూతురు చేసిన ఓ ప్రయాణం అనే పాయింట్ బాగుంది. తమిళ్ లో కూడా ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అయింది. దానికి తోడు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకొని ‘కణా’ను సక్సెస్ చేయగలిగాడు అరుణ్‌రాజ కామరాజ్‌. నిజానికి అరుణ్ ‘చక్ దే ఇండియా’ సినిమాను ఆదర్శంగా తీసుకొని ఈ కథను రాసుకున్నట్లు అనిపిస్తుంది. అందువల్లే ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు ‘చక్ దే ఇండియా’ను గుర్తుచేస్తాయి. ఆ కథ, స్క్రీన్ ప్లేను వాడుకొని తెలుగు ప్రేక్షకులకు కూడా సినిమాను కనెక్ట్ చేయగలిగాడు భీమినేని శ్రీనివాసరావు. కాకపోతే తమిళ్ లో వదిలేసినా లాజిక్కులు ఇక్కడ కూడా వదిలేసాడు దర్శకుడు. వాటిపై శ్రద్ధ పెట్టి ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త నేచురాలిటీ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది.

‘కణా’ కు మెయిన్ హైలైట్ గా నిలిచిన ఐశ్వర్య రాజేష్ ను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చింది. తద్వారా ఒరిజినల్ సన్నివేశాలను కూడా సులువుగా వాడుకోగలిగారు. ప్రీ క్లైమాక్స్ లో క్రికెట్ సన్నివేశాలు , శివ కార్తికేయన్ కోచింగ్ ఇచ్చే సన్నివేశాలను యధావిధిగా వాడుకున్నారు. అలా కాకుండా తెలుగులో కోచ్ క్యారెక్టర్ ను ఎవరైనా హీరోతో చేయించి ఆ సన్నివేశాలను మళ్ళీ తీసి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కాబట్టి ఆ క్యారెక్టర్ అంతగా క్లిక్ అవ్వలేదు. అలాగే కౌసల్య క్యారెక్టరైజేషణ్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఇంప్రూవ్ చేయాల్సింది. ఆ విషయంలోనూ తమిళ్ వర్శనే గుడ్డిగా ఫాలో అయిపోయాడు భీమినేని. ఐశ్వర్య రాజేష్ , కొన్ని ఎమోషనల్ సీన్స్ , సంగీతం సినిమాకు హైలైట్స్ కాగా గతంలో చూసేసిన కథ, ఊహకందేలా ఉండే కథనం, కొన్ని సన్నివేశాలు అతి అనిపించడం సినిమాకు మైనస్. ఓవరాల్ గా క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణముర్తి’, ‘చక్ దే ఇండియా’, ‘కణా’ చూసిన వారికి జస్ట్ పరవాలేదనిపించినా మిగతా వారికి నచ్చుతుంది.
 

నటీ నటులు : ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, ‘రంగస్థలం’ మహేశ్‌, విష్ణు, రవిప్రకాశ్‌ తదితరులు
ఛాయాగ్రహణం : ఐ. ఆండ్రూ
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: దిబు నినన్‌
కథ: అరుణ్‌రాజ కామరాజ్‌
మాటలు: హనుమాన్‌ చౌదరి
సమర్పణ: కె.ఎస్‌.రామారావు
నిర్మాత: కె.ఎ.వల్లభ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
విడుదల తేది : 23 ఆగస్ట్ 2019

రేటింగ్ : 2.75/5

 

 

 

 

 

 

@ జీ సినిమాలు

Trending News