Kavacham movie review | కవచం మూవీ రివ్యూ

కవచం మూవీ రివ్యూ

Last Updated : Dec 7, 2018, 06:40 PM IST
Kavacham movie review | కవచం మూవీ రివ్యూ

నటీనటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్, మెహ్రీన్, నీల్ నితిన్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని తదితరులు
సంగీతం : ఎస్ఎస్ థ‌మ‌న్
సినిమాటోగ్ర‌ాఫర్ : ఛోటా కే నాయుడు
ఎడిటింగ్ : ఛోటా కే ప్ర‌సాద్
నిర్మాత‌: న‌వీన్ చౌద‌రి సొంటినేని (నాని)
నిర్మాణ సంస్థ‌: వ‌ంశ‌ధార క్రియేష‌న్స్
కథ-ద‌ర్శ‌కుడు :  శ్రీ‌నివాస్ మామిళ్ళ‌
నిడివి: 141 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: డిసెంబర్ 7, 2018
 
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలు ఎలా ఉంటాయో ఆడియన్స్‌కు ఓ అంచనా ఉంది. ఆ అంచనాకు ఏమాత్రం తీసిపోదు కవచం. కాకపోతే ఇన్నాళ్లూ సీనియర్ డైరక్టర్లతో పనిచేసిన ఈ హీరో, ఫస్ట్ టైం ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నాడు. ఇంతకీ 'కవచం' ఎలా ఉంది..? బెల్లంకొండ కెరీర్‌కు ఇది 'కవచం'లా పనిచేస్తుందా..లేదా అనేదే ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
అనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు లేడు. రాణి మాత్రమే. ఆ రాణికి 'కవచం'లా ఓ సైనికుడు. టీజర్‌లో చెప్పిన ఈ వాక్యాలే సినిమా కథ. అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ఒక్కగానొక్క వారసురాలు సంయుక్త (కాజల్). ఆమెను విక్రమాదిత్య (నీల్ నితిన్ ముఖేష్)కు ఇచ్చి పెళ్లిచేయాలని చూస్తాడు కాజల్ మామ మహేంద్రవర్మ (ముకేష్ రుషి). ఓ షాపింగ్ మాల్‌లో అనుకోకుండా సంయుక్తను చూస్తాడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విజయ్ (బెల్లంకొండ శ్రీనివాస్). తర్వాత పలు సందర్భాల్లో కలిసిన ఆ ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరుగుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది.

Also read : కవచం ట్రైలర్ : క్రిమినల్‌తో ఓ పోలీస్ ఆడే ఆట

మరోవైపు శ్రీనివాస్‌కు లావణ్య (మెహ్రీన్) పరిచయమవుతుంది. కొన్ని విచిత్రమైన ఘటనల మధ్య ఆమెను తన ఇంట్లోనే పెడతాడు శ్రీనివాస్. అదే సమయంలో శ్రీనివాస్ తల్లికి యాక్సిడెంట్ అవుతుంది. తల్లి ఆపరేషన్ కోసం లావణ్యను కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడి డబ్బు తీసుకుంటాడు శ్రీనివాస్. అయితే అదే డ్రామా అతడి జీవితంలో నిజమవుతుంది. లావణ్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఆ నేరం శ్రీనివాస్‌పై పడుతుంది. అసలు శ్రీనివాస్ తల్లిని యాక్సిడెంట్ చేసింది ఎవరు, కాజల్ స్థానంలో వచ్చిన మెహ్రీన్ ఎవరు, కాజల్‌ను కిడ్నాప్ చేసింది ఎవరు? విజయ్‌ను ఎందుకు ఇరికించారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే 'కవచం' చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :
యాక్షన్ లుక్‌లో బెల్లంకొండ కనిపించడం ఇదేం ఫస్ట్ టైం కాదు. జయజానకి నాయక సినిమాలో అతడ్ని ఎంత చూపించాలో అంత చూపించాడు దర్శకుడు బోయపాటి. ఆ ఛాయలు అక్కడక్కడ 'కవచం'లో కూడా కనిపిస్తాయి. కాకపోతే పోలీస్ పాత్ర ఈ హీరోకు కొత్త. ఆ లుక్‌లో బెల్లంకొండ బాగానే ఉన్నాడు. కోట్ల ఆస్తికి వారసురాలిగా, ఓ సామాన్యుడ్ని ప్రేమించిన సగటు అమ్మాయిగా కాజల్ చక్కగా నటించింది. మూవీలో మెహ్రీన్‌కు చాలా కీలకమైన పాత్ర దక్కింది. నిజానికి సినిమా మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది.
విలన్‌గా నీల్ నితిన్ ముఖేష్ సీరియస్‌గా కనిపించాడు తప్ప, క్రూరంగా కనిపించలేదు. హర్షవర్థన్ రాణేకు మంచి పాత్ర దక్కింది. సీనియర్ పోలీసాఫీసర్‌గా పోసాని పంచ్‌లు అక్కడక్కడ పేలాయి. సత్యం రాజేష్, అజయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో కామెడీ లేదు.
 
టెక్నీషియన్స్ పనితీరు :
టెక్నీషియన్స్ పనితీరు విషయానికొస్తే, డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్లతోనే ప్రారంభించాలి. మొదటి సినిమాకు ఏ దర్శకుడైనా లవ్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకుంటాడు. థ్రిల్లర్స్ జోలికి అస్సలు పోరు. కానీ శ్రీనివాస్ మాత్రం తన తొలి సినిమాకే 'కవచం' లాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎంచుకోవడమే కాకుండా.. ఆ కథతో మెప్పించాడు కూడా. తను ఎక్కడా తడబడకుండా, ప్రేక్షకుడ్ని ఎక్కడా కన్ఫ్యూజ్ చేయకుండా సీన్ బై సీన్ నీట్‌గా రాసుకున్నాడు. దర్శకుడు శ్రీనివాస్‌కు వున్న ఈ క్లారిటీనే ఈ సినిమాకు పెద్ద 'కవచం'.

డైరెక్టర్‌కు నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ నుంచి పూర్తి సహకారం లభించింది. ఈ జానర్ సినిమాలకు ఎడిటింగ్ చాలా ముఖ్యం. ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా గ్రిప్ మిస్ అవుతుంది. ఈ విషయంలోనూ 'కవచం' ఆడియెన్స్‌ని మెప్పించింది. ఇక సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు, తన ఎక్స్‌పీరియన్స్‌తో ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపించాడు. వీళ్లందరి వల్ల నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. ఇక పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన తమన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరోసారి మెప్పించాడు.

పోలీస్ అంటేనే వెండితెరపై తిరుగులేని కమర్షియల్ ఫార్ములా. అలాంటి సబ్జెక్ట్‌కు థ్రిల్లర్ జానర్ కూడా యాడ్ చేస్తే మినిమం గ్యారెంటీ. అందుకే 50 కథలు విన్న బెల్లంకొండ ఫైనల్‌గా దీనికి ఓకే చేశాడు. కథపై బెల్లంకొండ ఇంత నమ్మకం ఎందుకు పెట్టుకున్నాడో, సినిమా ప్రారంభమైన 40 నిమిషాల వరకు మనకు అర్థంకాదు.

థ్రిల్లర్ సబ్జెక్ట్‌కు స్క్రీన్‌ప్లే చాలా ముఖ్యం. మూవీ స్టార్ట్ అయిన వెంటనే కథలోకి వెళ్లాలి. ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేయాలి. 'కవచం'లో మాత్రం మొదటి అరగంట అలాంటి ప్రయత్నాలేం జరగవు. బెల్లంకొండను మిస్టర్ క్లీన్ పోలీస్‌గా, హీరోగా చూపించడానికే టైమ్ కేటాయించారు. ఆ తర్వాత మెహ్రీన్ రాకతో తొలి అయోమయం మొదలవుతుంది. వీళ్లిద్దరి ట్రాక్స్ ఎందుకు నడుస్తుంటాయో ప్రేక్షకుడికి అర్థంకావు. ట్విస్టులన్నీ సెకెండాఫ్ కోసం దాచేయడంతో వచ్చిన సమస్య ఇది. ఎట్టకేలకు హీరో తల్లి పాత్రకు యాక్సిడెంట్ అవ్వడంతో అసలు కథ మొదలవుతుంది.

అక్కడ్నుంచి టామ్ అండ్ జెర్రీ గేమ్ మొదలవుతుంది. విలన్ ఎత్తులకు హీరో పైఎత్తులు కనిపిస్తాయి. అంతిమంగా గెలుపు ఎవరిదో అందరికీ తెలిసిందే కాబట్టి, క్లైమాక్స్‌తో సంబంధం లేకుండా ట్విస్టులపై దృష్టిపెట్టిన దర్శకుడు, ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. ఒక్కొక్కటిగా మిస్టరీని చేధిస్తూ 'కవచం' ముందుకు సాగుతుంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కానీ మధ్యమధ్యలో వచ్చే తమన్ పాటలు బోర్ కొట్టించాయి. దీనికి తోడు కాజల్, మెహ్రీన్ లాంటి ముద్దుగుమ్మలకు సరైన ఎలివేషన్ ఇవ్వలేదు. బెల్లంకొండ, కాజల్ మధ్య వచ్చే ఇంట్రో సీన్లు బోర్ కొట్టిస్తాయి.

కిడ్నాప్ డ్రామా పేరు చెప్పి విలన్ నుంచి హీరో డబ్బులు కొల్లగొట్టే సన్నివేశం, క్లైమాక్స్‌లో విల్లాలో మిస్టరీని చేధించే ఎపిసోడ్, మెహ్రీన్ క్యారెక్టర్‌పై ట్విస్ట్ రివీల్ చేసే సీన్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్. వీటితో పాటు సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకుంటాయి. నీల్ నితిన్ విలనిజం, పోసాని కామెడీ పండకపోవడం, పాటలు యావరేజ్‌గా అనిపించడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ కవచాన్ని ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ – 2.5/5

జీ సినిమాలు సౌజన్యంతో... 

Trending News