భారతదేశంతో పాటు పలు దేశాల్లో ఫేస్బుక్ వాడుతున్న యూజర్లు ప్రస్తుతం అయోమయంలో పడ్డారు. గత రెండు రోజులుగా చాలామంది యూజర్లు పెడుతున్న పోస్టులు, షేర్ చేస్తున్న పోస్టులు కూడా ఫేస్‌బుక్‌లో వాటంతట అవే తొలిగిపోవడంతో చాలామంది కంగారు పడుతున్నారు. ఎక్కువగా షేర్ అవుతున్న పోస్టులతో పాటు మామూలు పోస్టులు కూడా తొలిగిపోవడంతో యూజర్లు ఏం చేయాలో అర్థం కాక అవస్థ పడుతున్నారు.
అయితే స్పామ్‌ని అరికట్టడంలో భాగంగా ఫేస్బుక్ ప్రస్తుత సాంకేతిక పద్ధతులను ఆధునీకరించాలని చూస్తుందని.. ఈ పద్ధతి ప్రస్తుతం టెస్టింగ్ ఫేస్‌లో ఉండడం వల్లే యూజర్లు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అన్నది సమాచారం. ముఖ్యంగా ఇంగ్లీష్ కాకుండా ప్రాంతీయ భాషల్లో పోస్టులు చేస్తున్నవారే ఎక్కువగా ఈ ఇబ్బందికి గురవతున్నారు. అయితే ఫేస్బుక్ నిబంధనల ప్రకారం మీ పోస్టును ఫేస్బుక్ యాజమాన్యం స్పామ్‌గా పరిగణించి డిలీట్ చేస్తే.. మీరు వారిని సంప్రదించి ఆ పోస్టు మళ్లీ రీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే అది స్పామ్ పోస్టు కాదని నిరూపించుకోవాలి. అయితే ఈ ఇబ్బంది ఎక్కువ రోజులు ఉండదని.. చాలా వేగంగానే సమస్య సద్దుమణిగిపోతుందని సమాచారం.
అయితే ఇలాంటి సాంకేతిక ఇబ్బందులకు కారణం యూజర్లు కూడా విపరీతంగా స్పామ్‌ని ప్రోత్సహించడమే అని ఇటీవలి కాలంలోనే సోషల్ మీడియా వ్యవస్థపై సర్వే చేసిన ఓ అంతర్జాతీయ సంస్థ తెలిపింది . ఒకసారి పోస్టు చేసిన పోస్టునే లెక్కకు మించి కొన్ని వందల గ్రూపుల్లో ఒకే వ్యక్తి పోస్టు చేయడం, కొన్ని వందల మందికి, వేలమందికి మెసేజ్ల రూపంలో పంపడం వల్లే స్పామ్ పెరిగిపోతుందని వారు పేర్కొన్నారు.
ఈ క్రమంలో పలువురు సాంకేతిక నిపుణులు కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సోషల్ మీడియాని జనాలు స్వతంత్రంగా ఉపయోగించుకోవచ్చనే సిద్ధాంతానికి ఫేస్బుక్ కట్టుబడి ఉన్నా.. అనైతిక కార్యకలాపాలు చేసేందుకు, రాజకీయ ప్రచారంతో పాటు తమ ప్రచారాన్ని విరివిగా, విచ్చలవిడిగా చేసుకొనేందుకు.. అందుకోసమే జనాలు సోషల్ మీడియాని వాడడానికి ప్రయత్నించినప్పుడు.. ఆ వ్యవస్థ మనుగడ దెబ్బతినే అవకాశం ఉందనేది వారి అభిప్రాయం.
ఈ మధ్యకాలంలో స్పామ్ ఎక్కువవుతున్న పోస్టుల్లోని కీవర్డ్స్‌ను ఆధారంగా చేసుకొని... ఎక్కువ మొత్తంలో సైట్‌లో పేరుకుపోతున్న స్పామ్ చెత్తను తొలిగించే దిశగా కూడా సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గ సాంకేతికత తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నాయి. అలాంటి సందర్భంలో స్పామ్ పోస్టుల్లోని కీవర్డ్స్ వాడే మూమూలు యూజర్ల సాధారణ పోస్టులపై కూడా వాటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు.. తమ పోస్టులకు స్పామ్ ముద్ర పడకూడదని భావిస్తే.. తమ గ్రూపుల్లో కూడా స్పామ్‌ను ప్రోత్సహించే మిత్రులను సైతం బ్లాక్ చేసుకోవాల్సిందే.