టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరున్న ప్రభాస్‌ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే ఓ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది అని చెబుతూనే అది ప్రేమ పెళ్లి కూడా కావొచ్చు అని బదులిచ్చాడు. సాహో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రభాస్ చెప్పిన సమాధానం వింటుంటే.. డార్లింగ్ లవ్ మ్యారేజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడా ఏంటనే సందేహాలు కలుగుతున్నాయంటున్నారు అతడి అభిమానులు. ఏదేమైనా ప్రభాస్ అభిమానులకు అతడు నటించిన బాహుబలి, సాహో సినిమాలపై ఎంత క్రేజ్ ఉందో.. ఆ తర్వాత మళ్లీ అంతటి ఆసక్తి అతడి పెళ్లిపైనే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇక సాహో సినిమా అప్డేట్స్ విషయానికొస్తే, ఆగస్టు 30న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ ఆదివారం రామోజి ఫిలిం సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.