"రాఘవ లారెన్స్" హీరో నెంబర్ 150 ఎందుకు అయ్యాడో తెలుసా..?

తెలుగులో మాస్, డాన్, స్టైల్ లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ ఓ ట్రస్టును నడుపుతున్న సంగతి తెలిసిందే.

Last Updated : Oct 29, 2018, 05:19 PM IST
"రాఘవ లారెన్స్" హీరో నెంబర్ 150 ఎందుకు అయ్యాడో తెలుసా..?

తెలుగులో మాస్, డాన్, స్టైల్ లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ ఓ ట్రస్టును నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రస్టు ద్వారా ఆయన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులను ఆదుకుంటున్నారు. వారికి ఓపెన్ హార్ట్ సర్జరీలు తన డబ్బు వెచ్చించి చేయిస్తున్నారు. ఇటీవలే రాఘవ లారెన్స్ తన ట్రస్టు ద్వారా 150వ ఆపరేషన్ చేయించారు. కావ్యశ్రీ అనే చిన్నారికి గుండెలో కన్నం ఏర్పడితే.. దానిని పూడ్చడం కోసం డాక్టర్లు చాలా ఖర్చు అవుతుందని తెలిపారు.

ఆ డబ్బును స్వయంగా లారెన్స్ ఆసుపత్రి వారికి అందజేసి.. ఆ ఆపరేషన్ చేయించారు. గతంలో కూడా పలుమార్లు లారెన్స్ ఇలాగే సహాయం చేశారు. పర్యావరణ విపత్తులు ఏర్పడినప్పుడు, ఇతర రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు కూడా రాఘవ లారెన్స్ తనవంతు సాయం చేశారు. రాఘవ లారెన్స్ కేరళ వరద బాధితులకు కూడా రూ.1 కోటిని విరాళంగా ప్రకటించారు. తమిళనాడు జల్లికట్టుకు మద్దతు ఇస్తూ జరిగిన పోరాటానికి కూడా లారెన్స్ తన  సపోర్టును అందించారు.

ప్రస్తుతం లారెన్స్ కాంచన 3 చిత్రంలో నటిస్తున్నారు. రాఘవేంద్రస్వామి భక్తుడైన లారెన్స్.. తన పేరుకి ఆయన పేరు కూడా కలుపుకొని రాఘవ లారెన్స్‌గా సుపరిచితులయ్యారు. ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ వద్ద కారు క్లీనర్‌గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్.. తనకు డ్యాన్స్ మీద ఉన్న ప్రేమతో పలు షోలు చేసేవారు. ఆ తర్వాత రజనీకాంత్ ప్రోత్సాహంతో డ్యాన్సర్స్ యూనియన్‌లో చేరారు. తర్వాత, చిరంజీవి నటించిన హిట్లర్, మాస్టర్ సినిమాలలో పాటలకు లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. తన కెరీర్‌లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా 4 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 

Trending News