స్టాండప్ కామెడీ పేరుతో మహేష్ బాబుకి అవమానం

తమిళనాడులో స్టాండప్ కమెడియన్‌గా తనకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ప్రభాకర్.. ఇటీవలే తాను చేసిన ఓ షోలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. 

Updated: Sep 14, 2018, 06:43 PM IST
స్టాండప్ కామెడీ పేరుతో మహేష్ బాబుకి అవమానం

తమిళనాడులో స్టాండప్ కమెడియన్‌గా తనకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ప్రభాకర్.. ఇటీవలే తాను చేసిన ఓ షోలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుకి అసలు నటనే రాదని.. తనకంటే ఎస్ జే సూర్య "స్పైడర్" చిత్రంలో చాలా బాగా నటించాడని ఆయన తెలిపారు. మహేష్ హావభావాలు కత్రినా కైఫ్‌లా ఉంటాయని.. అతన్ని కత్రినా మేల్ వెర్షన్ అనవచ్చని మనోజ్ తెలిపాడు. అలాగే మహేష్ చేసిన ఆగడు, సైనికుడు సినిమాలపై కూడా మనోజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహేష్ ఏ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా తనకు కామెడీగానే ఉంటుందని మనోజ్ అన్నారు.

అయితే మనోజ్ చేసిన వ్యాఖ్యలపై ఇటు మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. స్టాండప్ కామెడీ పేరుతో తమ హీరోని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హితవు పలికారు. వెంటనే మనోజ్ ప్రభాకర్ మహేష్ బాబుకి క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో వార్నింగ్ కూడా ఇచ్చారు. మహేష్ బాబుకి యాక్టింగ్ రాదనే వారు.. నిజం, మురారి, నేనొక్కడినే లాంటి సినిమాలు చూసి మాట్లాడాలని మహేష్ ఫ్యాన్స్ తెలిపారు. 

తమిళనాడుకి చెందిన మహేష్ అభిమానులు కూడా కొందరు మనోజ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉండాల్సిన స్టైల్ వారికి ఉంటుందని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టేలా మాట్లాడితే ఇండస్ట్రీలో పొరపొచ్చాలు వస్తాయని తెలిపారు. తమిళ హీరోలైన విజయ్, అజిత్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తుంటారని.. కానీ సంస్కారం మరిచి తెలుగు హీరోలపై ఇలాంటి కామెంట్లు చేయడం తగదని కూడా ఫ్యాన్స్ తెలిపారు. ప్రస్తుతం స్టాండప్ కామెడీకి ఆదరణ పెరుగుతున్న క్రమంలో ఒకరి మనోభావాలు దెబ్బతినేలా కామెడీ చేయడం తగదని కూడా కొందరు అంటున్నారు.

అయితే మహేష్ పై కామెంట్లు చేశాక మనోజ్ పై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో వేలకొద్దీ కామెంట్లు పోస్టు చేశారు. ఈ క్రమంలో మనోజ్ క్షమాపణ చెబుతూ ఫేస్ బుక్‌‌లో పోస్టు పెట్టారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించమని ఆయన కోరారు. ఈ ట్రోలింగ్‌ను ఆపమని తెలిపారు.