రౌడీ క్లబ్ ఏర్పాటు చేసిన 'అర్జున్ రెడ్డి'

రౌడీ క్లబ్ ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ 

Last Updated : Jun 11, 2018, 01:25 PM IST
రౌడీ క్లబ్ ఏర్పాటు చేసిన 'అర్జున్ రెడ్డి'

అర్జున్ రెడ్డి సినిమాతో తాను ఏంటో నిరూపించుకోవడమే కాకుండా తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి అనేటటువంటి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా రౌడీ క్లబ్ ఏర్పాటు చేయడం ద్వారా సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తాను ప్రత్యేకమే అని మరోసారి నిరూపించుకున్నాడు. రౌడీ క్లబ్ అంటే రౌడీల కోసం ఏర్పాటు చేసిన రియల్ క్లబ్ అని అనుకోకండి. ఎందుకంటే ఇదేమీ నిజంగా ఏదో రౌడీల కోసం సృష్టించింది కాదు కనుక. అవును, టాలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేటు క్లాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన విజయ్ దేవరకొండ తన అభిమానులతో టచ్‌లో ఉండటం కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ పేరే ఈ రౌడీ క్లబ్. తన అభిమానులని ముద్దుగా రౌడీస్ అని పిలుచుకునే విజయ్ దేవరకొండ తన వెబ్‌సైట్‌కి కూడా రౌడీక్లబ్.ఇన్ అనే పేరు పెట్టాడు. 

తాజాగా ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ అయిన విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ విజయ్ దేవరకొండనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. చిరంజీవి, వెంకీ, బాలయ్య బాబు వంటి బిగ్ స్టార్స్‌తో కలిసి ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ అవడంపై ఆనందం వ్యక్తంచేస్తూ అభిమానులకు ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. 

 

రౌడీక్లబ్.ఇన్ అడ్రస్‌తో ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్‌లో విజయ్ దేవరకొండ అభిమానులు తమ వివరాలు నమోదు చేసుకుని తమ అభిమాన నటుడితో టచ్‌లో ఉండవచ్చు. పూర్తి స్థాయిలో డేట్ బేస్ క్రియేట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ వారితో టచ్‌లోకి రానున్నాడు. త్వరలోనే మీతో టచ్‌లోకి రానున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పిన విధానం అతడి అభిమానులను మరింత ఎగ్జైట్‌మెంట్‌కి గురిచేస్తోంది.   

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం నోటా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న ఈ యంగ్ హీరో చేతిలో డియర్ కామ్రేడ్, టాక్సీ వాలా చిత్రాలు కూడా ఉన్నాయి. 

Trending News