ఒళ్లు జలదరించే సౌందర్య చిట్కాలు

          

Last Updated : Nov 12, 2017, 02:55 PM IST
ఒళ్లు జలదరించే సౌందర్య చిట్కాలు

పూర్వం అందంగా కనిపించాలంటే ఒంటికి సగ్గుపిండి, పసుపు .. వంటివి పూసుకొనేవారు. కానీ నేడు పరిస్థితి అలా లేదు. బ్యాటిపార్లర్లు, స్పాలకు వెళ్తున్నారు. అక్కడ రకరకాల సౌదర్యం చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే ఈ మధ్య ఈ సౌందర్య చికిత్సలు  వింతగా తయారయ్యాయి. ఎంతలా అంటే .. మన ఊహకు అందనంత. 

* జపాన్ లో నైటింగేల్ పక్షి వేసే రెట్టలు ఎండాక, ఆ పొడిని బియ్యం నీటిలో కలిపి ముఖానికి రాసుకుంటారు. చర్మ సమస్యలని దూరం చేసుకొనేందుకు ఈ రకం ఫేషియల్ వేసుకుంటారట. 

* క్రయోథెరపీ చికిత్సలో భాగంగా మైనస్ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద అతిథుల్ని మూడు నిమిషాలు ఉంచుతారు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు  సుమీ! అంత కష్టపడి గడ్డకట్టే అంత చలిలో ఎందుకు ఉంటారనేగా మీ డౌట్? ఆ గడ్డ కట్టే చలి వల్ల శరీరం ఆనందాన్ని కలిగించే సెరోటోనిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుందట. ముఖంపై చిరునవ్వు లేని ఎంతటివారినైనా ఈ థెరపీ ద్వారా నవ్వించవచ్చట. 

* పైన కూరగాయ పాత్ర పెట్టి కింద మంట పెట్టినట్టు.. ఫిలిప్పీన్స్ లో మనుషుల్ని నీటిలో నింపిన పెద్ద పాత్రల్లో పడుకోబెట్టి కింద మంట పెడుతారు. ఔషధ మూలికలు వేసిన ఆ నీరు వేడెక్కుతుంటే హాయైన అనుభూతి కలగడంతో పాటు మృతకణాలు (dead cells) తొలగుతాయట. చైనాలో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఒకటుంది. ఆ చికిత్సతో ముడుతలు పోయి యవ్వనం వస్తుందట. 

* జపాన్ తో పాటు మరికొన్ని దేశాల్లో స్నెయిల్ ఫేషియల్స్ అనే కొత్త రకం ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే నత్తను ముఖంపై పాకించుకోవడం. నత్త పాకేటప్పుడు జిగట పదార్థాన్ని విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఆ ద్రవంలో చర్మంపై ముడుతలు పడకుండా చెయ్యగల ఔషధ గుణాలు ఉన్నాయట.  

* ఫిలిప్పీన్స్, ఇతర దేశాల్లో కోరలు పీకిన పాములు, కొండా చిలువల్ని శరీరంపై పాకించి మసాజ్ చేస్తున్నాయి కొన్ని స్పాలు. దీనివల్ల ఒత్తిడి దూరమవుతుంది. శరీరానికి విశ్రాంతి కూడా అందుతుందట. 

* జలగలు రక్తాన్ని పీల్చుతాయని తెలుసు. అలాంటిది శరీరంపై పాకించుకుంటే.. ! వామ్మో అనమూ. కానీ వివిధ దేశాల్లో కొన్ని బ్యూటీ స్పాలలో ఈ తరహా థెరపీ ఉంది. దీనిని లీచ్ థెరపీ అంటారట. ఈ చికిత్సలో పదుల సంఖ్యలో ముఖంపై జలగల్ని వదులుతారట. జలగలు చర్మం పై  పొరల్లో ఉండే చెడు రక్తాన్ని పీల్చేస్తాయిట. 

* ఇవి కొన్ని మాత్రమే.. తేనెటీగలతో కుట్టించుకోవడం, మనిషి రక్తాన్ని ముఖానికి రాసుకోవడం, పాములు, తేళ్ల నుంచి తీసే విషంతో ఫేషియల్స్, బీరు, వైనూ, కాఫీ, టీ .. స్నానాలు ఇలా ఎన్నో రకాల సౌందర్య చికిత్సలు పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.

Trending News