స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బంతా బ్లాక్ మనీ కాదు: అరుణ్ జైట్లీ

ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్ బుక్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jun 30, 2018, 12:05 PM IST
స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బంతా బ్లాక్ మనీ కాదు: అరుణ్ జైట్లీ

ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బ్లాగులో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అంత క్రియాశీలకంగా జరగడం లేదని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

తాజాగా స్విస్ బ్యాంకులో దాదాపు రూ.7000 కోట్ల వరకు పలువురు భారతీయులు పెట్టుబడులు పెట్టారని.. ఈ క్రమంలో గతంతో పోల్చుకుంటే 50 శాతం వరకు నల్లధనం నిల్వలు స్విస్ బ్యాంకులో పెరిగాయని పలు పత్రికలు రాసిన వార్తల పట్ల జైట్లీ అసహనం వ్యక్తం చేశారు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారందరూ నల్లధనాన్ని దాచినట్లు కాదని ఆయన అన్నారు.

ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే... తమకు తెలియకుండా ఉండదని.. నల్లధనాన్ని దాచే ప్రతి ఒకరిపై కూడా తీవ్రస్థాయిలో పెనాల్టీ ఉంటుందని జైట్లీ తెలియజేశారు. 

"స్విట్జర్లాండ్, భారత్ దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం జనవరి 1, 2018 తేది నుండి ఇప్పటి వరకు అక్కడి బ్యాంకులలో భారతీయుల లావాదేవీలకు సంబంధించిన సమాచారం మొత్తం మన దేశానికి అందుతుంది. అలాంటప్పుడు అక్కడ భారతీయులు పలు ఆర్థిక లావాదేవీలు జరిపినంత మాత్రాన.. వారు నల్లధనాన్ని దాచుకుంటున్నారని భావించనవసరం లేదు.

అలాంటిదేమైనా జరిగితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది" అని జైట్లీ తెలిపారు. ఇదిలా ఉండగా.. 2017 డేటా ప్రకారం స్విస్ బ్యాంకులో ఆర్థిక లావాదేవాలు చేస్తున్న విదేశీయుల శాతం 3 శాతం వరకు పెరిగింది. దాదాపు వారి నుండి 1.46 ట్రిలియన్ స్విస్ ఫ్రాంకుల అనగా 100 లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు సమాచారం.

Trending News