డియర్ జవాన్.. నువ్వు భారతీయుడివేనా..!

  

Last Updated : Nov 12, 2017, 03:39 PM IST
డియర్ జవాన్.. నువ్వు భారతీయుడివేనా..!

అస్సాంలో ఓ మాజీ ఆర్మీ మెడికల్ ఆఫీసరుకి చిత్రమైన సమస్య ఏర్పడింది. తాను భారతీయుడు అవునా.. కాదా.. అన్న విషయంలో ప్రభుత్వానికి సందేహం ఉందని, కనుక వెంటనే తాను ఈ దేశ పౌరుడేనని నిరూపించుకోవాలని.. వీలైతే కోర్టుకి వెళ్లి భారత పౌరుడిగా నిరూపణ చేయాలని అస్సాంలోని ఫారినర్స్ ట్రిబ్యునల్.తేజపూర్ వాసైన నాయక్ సుబేదార్ దిలీప్ దత్తాకి నోటీసులు పంపింది. దిలీప్ దత్తా 1971లో భారత్, పాక్ యుద్ధంలో పాల్గొన్న జవాన్‌నని, 1993లో పదవీ విరమణ చెందానని చెబుతున్నా.. ఆయన పౌరసత్వంపై రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానం ఉందని కావున, ఆయన తగిన సాక్ష్యాలతో నిరూపించుకోవాలని ట్రిబ్యూనల్ కోరింది. "1965లో నేను ఇండియన్ ఆర్మీ మెడికల్ వింగ్‌లో చేరాను. ఆ తర్వాత మూడు దశాబ్దాల పాటు మెడికల్ ఆఫీసరుగా భారత సైనికదళానికి సేవలందించాను. ఇప్పుడు నా పౌరసత్వాన్ని నిరూపించుకోమనడం నన్ను కించపరచడమే" అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దత్తా. అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి "నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్" పేరుతో జనాభా డేటాను సేకరిస్తోంది. ఆ డేటా సేకరణలో భాగంగా బంగ్లాదేశ్ లేదా ఇతర దేశాల నుండి నుండి వలస వచ్చిన పౌరులు ఎవరైనా ఉండి.. వారు భారత్‌లో అనధికారికంగా నివసిస్తున్నారని తేలితే తగిన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డేటాను పూర్తిగా సేకరించడానికి గడువు తేదీగా డిసెంబరు 31, 2017 ను నిర్ణయించడం జరిగింది. 

Trending News