న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ వినియోగంలో భద్రతా ప్రమాణాలను పాటించకుండా ముప్పును కలిగించే యాప్స్ ఏవిపడితే అవి వాడితే, వాటి పర్యావసనాలు వేరే విధంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నా.. తరచుగా కొంతమంది మోసపూరితమైన యాప్స్ వినియోగించి సైబర్ క్రైమ్ బారినపడుతూనే వున్నారు. తాజాగా గురుగ్రామ్‌లోనూ అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తన స్మార్ట్ ఫోన్ కు వచ్చిన ఓ మెస్సేజ్‌లో వున్న లింకును క్లిక్ చేయడం ద్వారా తనకు తెలియకుండానే ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న హరీష్ చందర్ అనే వ్యాపారి.. ఆ యాప్ ద్వారానే తనకు తెలియకుండానే రూ.60 వేలు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
యాప్ డౌన్‌లోడ్ అయిన మరుసటి రోజున అదే మొబైల్ నెంబర్‌తో అనుసంధానం చేసి వున్న బ్యాంక్ ఎకౌంట్‌లోంచి రూ.60 వేలు మాయమైన ఘటన గతేడాది సెప్టెంబర్‌లో చోటుచేసుకోగా బుధవారం నాడు సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగిన వెంటనే బ్యాంకుకు వెళ్లి ప్రశ్నించగా ఈ విషయంలో తాము చేయగలిగింది కూడా ఏమీ లేదని బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. అనంతరం జరిపిన విచారణలో ఆ మొబైల్ యాప్ ద్వారానే హ్యాకర్స్ డబ్బును కొల్లగొట్టినట్టు విచారణలో వెల్లడైంది. పూణెకి చెందిన మొబైల్ నెంబర్ నుంచి హ్యాకర్స్ ఈ దోపిడీకి పాల్పడినట్టు తేలింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హ్యాకర్స్ ఎవరని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.