న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఉల్లి కొరత బాగా ప్రాంతాల్లో కిలో 80 వరకు పలుకుతోంది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించినప్పటికీ ధరలు మాత్రం దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఉల్లిపాయల కొరతను అధిగమించి, ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెలాఖరు కల్లా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఒక టన్నుకు గరిష్టంగా 352 డాలర్ల ధరను ఖరారు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం నేతృత్వంలోని ఎంఎంటీసీ కంపెనీ టెండర్లు కూడా ఆహ్వానించింది.
ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన వరదల కారణంగా మార్కెట్‌కి వచ్చే ఉల్లి పంట భారీగా పడిపోయింది. ముఖ్యంగా ఉల్లి పంటను బాగా పండించే మహారాష్ట్రలోనే ఈసారి వరదలు సంభవించడం ఉల్లి ధరపై తీవ్రమైన ప్రభావం చూపింది. దీనికితోడు పండుగల సీజన్ కావడంతో వాటి ధర ఇంకాస్త పైకి ఎగబాకింది. దీంతో పెరుగుతున్న ఉల్లి ధరను అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీ మొత్తంలో దిగుమతులే పరిష్కారం అని కేంద్రం భావిస్తోంది.