న్యూఢిల్లీ: డూప్లికేట్, బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు వీలుగా ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అంతేకాకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950కి సవరణలు చేయాల్సిందిగా న్యాయ శాఖకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది. ఆధార్ నెంబర్‌తో ఓటర్ ఐడి నెంబర్‌ను అనుసంధానం చేయడం వల్ల ఒక్కొక్కరు ఒక్క ఓటు మాత్రమే వినియోగించుకోవడంతో పాటు నకిలీ ఓట్లను అరికట్టవచ్చని ఎప్పటి నుంచో చెబుతూ వస్తోన్న ఈసి.. తాజాగా ఆ దిశగా న్యాయ శాఖకు తొలిసారిగా లేఖ రాసింది. ఆధార్ అనుసంధానం పౌరుల స్వచ్ఛంద నిర్ణయం అని గతంలో చెప్పిన ఈసీ.. 2016లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఏకే జోషి బాధ్యతలు చేపట్టిన అనంతరం తన వైఖరి మార్చుకుంది.
ఇదిలావుంటే, ఇప్పటికే 32 కోట్ల మంది ఆధార్ నంబర్లు ఓటర్ ఐడీ కార్డులతో అనుసంధానం చేసుకున్నట్టు ఈసి ప్రకటించడం గమనార్హం.