భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ శుక్రవారం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపేరులో గాంధీ అనే పదం లేకపోతే.. తాను కనీసం ఎంపీను కూడా కాలేకపోయేవాడినని ఆయన తెలిపారు. "నాయకులను ఎన్నుకోవడంలో ప్రజల పాత్ర - వారి హక్కులు" అనే అంశంపై మాట్లాడిన ఆయన "నా పేరు ఫిరోజ్ వరుణ్ గాంధీ. నా ఇంటిపేరులో గాంధీ అనే పదం లేకపోతే నేను 29 ఏళ్ళకే ఎంపీ అయ్యి ఉండేవాడినని అనుకోవడం లేదు. గాంధీ అయితేనేం.. ఖాన్ అయితేనేం.. ఘోష్ అయితేనేం.. ఇలాంటి ఇంటిపేర్లు, టైటిల్స్ ఆధారంగా ప్రజలు ఓటు వేయకూడని రోజు భారత్‌లో రావాలని నేను ఆశిస్తున్నాను" అని ఆయన తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్ పూర్ నియోజకవర్గ ఎంపీగా ఎన్నికైన వరుణ్ గాంధీ 2016లో " రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్టు"లో మార్పులు చేసేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశబెట్టాలని కోరారు. సామాన్యజనులకు తాము ఎంపిక చేసిన నాయకుల పనితీరు నచ్చకపోతే.. రెండు సంవత్సరాల్లోనే వారిని దించేసే అధికారాన్ని కట్టబెట్టాలని ఆయన కోరారు. ఒకవేళ 75% ప్రజలు ఒక నాయకుడిని తిరస్కరిస్తే.. ఆ నాయకుడు గద్దె దిగేలా బిల్లు ఉండాలని ఆయన తెలిపారు.
ఆ బిల్లుపై వరుణ్ గాంధీ మాట్లాడుతూ "రాజకీయాలు, సినిమాలు, క్రికెట్, వ్యాపారం.. ఈ రంగాలన్నింటిలో రాణించడానికి సామాన్య మానవుడికి డోర్లు క్లోజ్ అయిపోయాయని నేను అనుకుంటున్నాను. తమిళనాడులో పరిస్థితే తీసుకోండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ.. తాము పండిస్తున్న పంటకు కిట్టుబాటు ధరకై ధర్నాలు చేస్తున్న సమయంలో... అదే రాష్ట్ర అసెంబ్లీలో ఓ బిల్లు పాసవ్వడానికి చర్చ మొదలైంది. తీరా ఆ బిల్లు దేని కోసమా అని చూస్తే.. ఎమ్మె్ల్యేల జీతాలు పెంచడానికి అని తెలిసింది. ఇక్కడ రైతులు ఇళ్ళు, వాకిళ్ళు అమ్ముకొని బతుకు కోసం పోరాడుతంటే.. వారిని కాపాడాల్సిన ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకోవడానికి ఆరాటపడ్డారు. అందుకే అలాంటి పాలకులను తాము అనుకున్నపుడు దింపేసే అధికారం ప్రజలకు కట్టబెట్టాలని నేను అనుకుంటున్నాను" అని వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు.
నేను ఎంపీ అవ్వడానికి గాంధీ పేరే కారణం